వచ్చే ఆర్థిక సంవత్సరంలో రసాయన రహిత వ్యవసాయ విధానాన్ని,కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని అన్నదాతలకు డిజిటిల్, సాంకేతిక సర్వీసులను అందించేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అందులో భాగంగా కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రసాయన రహిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కోర్సుల్లో మార్పులు చేసేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని అందించనున్నట్టు ఆర్థికమంత్రి వివరించారు. వ్యవసాయ రంగంలో అంకుర పరిశ్రమలు, గ్రామీణ ఎంటర్‌ప్రైజెస్‌లకు నాబార్డ్ ద్వారా సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ అంకురాలు ఎఫ్‌పీఓలకు మద్దతు అందించడం సహా రైతులకు అద్దె పద్దతిన పనిముట్లను సమకూర్చుతాయని వివరించారు.
చిరుధాన్యాల సంవత్సరంగా 2023..
2023 ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్. దేశీయంగా చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం 2.37లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
"2.37లక్షల కోట్ల రూపాయలను కనీస మద్దతుధర కింద ప్రభుత్వం వారి( రైతుల) ఖాతాల్లో వేయనుంది. దేశవ్యాప్తంగా రసాయన రహిత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తాం. అందులో భాగంగా తొలిదశలో గంగానదీ పరివాహక ప్రాంతం వెంబడి ఐదు కిలోమీటర్ల వరకు ఉన్న రైతుల భూములపై దృష్టి సారిస్తాం. నూనె విత్తనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయంగా నూనె విత్తనాల ఉత్పత్తిని పెంచేలా సమగ్ర విధానాన్ని తీసుకువస్తాం. పంటల అంచనా కోసం, భూరికార్డుల డిజిటలీకరణ, పురుగు మందుల పిచికారీకి కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్తామన్న ఆర్థిక మంత్రి గోదావరీ-కృష్ణా, కృష్ణా-పెన్నా సహా ఐదు నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి ముసాయిదా డీపీఆర్‌లు ఖరారు చేసినట్లు తెలిపారు.
"44 వేల 605 కోట్ల వ్యయం అంచనాతో కేన్-బెత్వా లింక్ ప్రాజెక్టును అమలుచేయనున్నాం. ఈ ప్రాజెక్టు 9 లక్షల హెక్టార్లకు సాగునీటి ప్రయోజనాలు అందించనుంది. 62 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చనుంది. నదుల అనుసంధానానికి సంబంధించి ఐదు ముసాయిదా డీపీఆర్‌లను ఖరారు చేశాం. గమన్ గంగా- పింజాల్, పర్‌తాపీ- నర్మదా, గోదావరీ- కృష్ణా, కృష్ణా- పెన్నా, పెన్నా- కావేరీ నదుల అనుసంధానాలకు ముసాయిదా డీపీఆర్‌లను ఖరారు చేశాం. లబ్ధి పొందే రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత వాటి అమలుకు కేంద్రం మద్దతు ఇస్తుంది."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
అడవుల పెంపకానికి ప్రాధాన్యం..
ప్రైవేటు రంగంలో అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతులు, ప్రైవేటు సంస్థలు అడవులు పెంచే విధంగా చట్ట సవరణలు చేయనున్నట్టు వివరించారు. ఇలా అడవుల పెంపకం చేపట్టే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి వివరించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'భారత్కు సొంత డిజిటల్ కరెన్సీ- క్రిప్టో ఆదాయంపై 30% పన్ను!'