అదనపు సుంకాల వడ్డనతో చైనాను అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రంప్ దూకుడుకు వాణిజ్య యుద్ధం విషయంలో చైనా కాస్త మెత్తబడింది. అమెరికా ఉత్పత్తులు కొన్నింటిపై సుంకాలను తొలగించింది డ్రాగన్ దేశం. తాజాగా చైనాపై బాదుడును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 రోజులు వాయిదా వేశారు.
250 బిలియన్ డాలర్లు విలువచేసే చైనా దిగుమతులపై వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సుంకాలను 25 నుంచి 30 శాతానికి పెంచాలని ఇప్పటికే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే 'పీపుల్స్ రిపబ్లిక్ చైనా' 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సుంకాల బాదుడును వాయిదా వేయాలని చైనా ఉపాధ్యక్షుడు లుహి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు ట్రంప్ ట్వీట్ చేశారు.
చైనా దారికి వస్తుంది...
వాణిజ్యయుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నిర్ణయాలతో చైనా సరఫరా గొలుసు(సప్లై చైన్) దెబ్బతిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
"చైనాతో మేము సరైన రీతిలో వ్యవహరిస్తున్నాం. ఎంతో శక్తిమంతమైన చైనా సరఫరా గొలుసు దెబ్బతింది. చైనా నుంచి పలు సంస్థలు బయటికి వచ్చేస్తున్నాయి. డ్రాగన్ దేశం ఒప్పందానికి సుముఖంగా ఉంది. నా నిర్ణయాల వల్లే 57 ఏళ్లలో చూడని అత్యంత దయనీయమైన ఆర్థికస్థితిని చైనా ఎదుర్కొంటోంది." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.