ఆధార్-పాన్ అనుసంధానం, గ్యాస్ ధర, జీఎస్టీఆర్-1 ఫైలింగ్ సహా సెప్టెంబరులో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త మార్పులు మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రానున్న కొన్ని ముఖ్యమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..
ఆధార్-పీఎఫ్ అనుసంధానం..
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ఆగస్టు 31 తుది గడువుగా విధించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అవుతాయి. లేదంటే ఇటు మీ వాటాతో పాటు.. ఉద్యోగం కల్పిస్తున్న సంస్థల వాటా కూడా పీఎఫ్ ఖాతాల్లో జమ కాదు.
జీఎస్టీఆర్-1 ఫైలింగ్..
సెప్టెంబరు నుంచి జీఎస్టీఆర్ ఫైలింగ్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు జీఎస్టీ నెట్‌వర్క్ వెల్లడించింది. కేంద్ర జీఎస్టీ నియమాల్లోని రూల్-59(6) ప్రకారం జీఎస్టీఆర్-1 ఫైలింగ్‌పై కొన్ని పరిమితులు విధించనున్నట్లు తెలిపింది. కొత్త నియమాల ప్రకారం.. మునుపటి ట్యాక్స్ పీరియడ్‌లో ఫారం జీఎస్టీఆర్-3బీలో రిటర్న్న్ దాఖలు చేయనివారు జీఎస్టీఆర్-1ని ఫైల్ చేయడానికి అనుమతి ఉండదు. అలాగే, త్రైమాసిక రిటర్న్స్‌ను సైతం దాఖలు చేయలేరు.
పాజిటివిటీ పే సిస్టం.. చెక్ క్లియరింగ్ సిస్టం
'పాజిటివిటీ పే సిస్టం'ను ఆర్‌బీఐ జనవరి నుంచే అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం.. ఎక్కువ విలువ కలిగిన (రూ.50 వేలు అంతకంటే ఎక్కువ) చెక్కులను జారీ చేసే ముందు కస్టమర్లు కచ్చితంగా బ్యాంకులకు తెలియజేయాలి. లేదంటే ఆ చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ కొత్త సిస్టంను అమల్లోకి తీసుకొచ్చాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు సెప్టెంబరు 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. ఈ మార్పునకు సంబంధించిన సమాచారం ఇప్పటికే బ్యాంకు ఎస్‌ఎంఎస్ ద్వారా కస్టమర్లకు తెలియజేసింది.
ఎస్‌బీఐ ఖాతాదారులు పాన్-ఆధార్ అనుసంధానం..
తమ ఖాతాదారులంతా ఆధార్-పాన్ అనుసంధానం చేయాలని ఎస్‌బీఐ ఇప్పటికే తెలియజేసింది. అందుకు సెప్టెంబరు 30ని తుది గడువుగా విధించింది. లేదంటే ఐడెంటిఫికేషన్ కార్డు సహా దీని ద్వారా లభించే ప్రయోజనాలు రద్దవుతాయి. దీనివల్ల కొన్ని ప్రత్యేక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఒక్కరోజులో రూ.50 వేలకు పైగా డిపాజిట్ చేయాలన్నా ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి.
గ్యాస్ ధర ఈసారీ పెరిగేనా?
గత రెండు నెలల్లో వంటగ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. చివరిసారి ఆగస్టు 18న ఒక్కో సిలిండర్‌పై రూ.25 పెంచారు. జులైలోనూ రూ.25.50 పెరిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులోనూ గ్యాస్ ధర పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కో సిలిండర్ ధర రూ.165 మేర పెరగడం గమనార్హం.
ఇదీ చూడండి: జన్ ధన్ ఖాతాలు@43 కోట్లు- డిపాజిట్లు రూ.1.46 లక్షల కోట్లు