ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం టీడీఎస్, టీసీఎస్ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటన చేశారు. తాజాగా ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) రేట్లను సవరించింది. డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీ, అద్దె, ప్రొఫెషనల్ ఫీజులు, స్థిర ఆస్తుల కొనుగోలు రుసుములపై ట్యాక్స్ డిడక్షన్‌ను 25శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటన వెలువరించింది.
సవరించిన రేట్లు 2020 మే 14 నుంచి 2021 మార్చి 31 వరకు వర్తించనున్నట్టు సీడీబీటీ స్పష్టం చేసింది.
కొత్త రేట్లు
మ్యూచ్యువల్ ఫండ్స్ రూపంలో చెల్లించే డివిడెండ్‌పై టీడీఎస్‌ను 10శాతం నుంచి 7.5శాతానికి తగ్గించింది సీబీడీటీ. రూ.10 లక్షలకు మించి విలువైన మోటార్ వాహనాల అమ్మకాలపై విధించే టీసీఎస్‌ను 1శాతం నుంచి 0.75శాతానికి కుదించింది.
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై టీడీఎస్‌ను 5శాతం నుంచి 3.75కి తగ్గించింది. టెండూ ఆకులు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, ఇనుప ధాతువు సహా పలు ఉత్పత్తుల అమ్మకాలపై టీసీఎస్‌ను సైతం బోర్డు సవరించింది. మరో 23 విభాగాలకు సంబంధించి నూతన రేట్లను ప్రకటించింది.
విభాగం | సవరించిన రేట్లు | ఇదివరకు ఉన్న రేట్లు |
స్థిరాస్తి కొనుగోలు చెల్లింపులు | 0.75% | 1% |
ఈకామర్స్ పార్టీసిపెంట్స్ | 0.75% | 1% |
ప్రొఫెషనల్ ఫీజులు | 1.5% | 2% |
జాతీయ సేవింగ్స్ పథకంలో డిపాజిట్లు | 7.5% | 10% |
మ్యూచ్యువల్ ఫండ్స్ ముందస్తు కొనుగోళ్లు | 15% | 20% |
ఇన్సూరెన్స్ కమీషన్, బ్రోకరేజీ | 3.75% | 5% |