స్టాక్ మార్కెట్ల చరిత్రలో శుక్రవారం అధ్బుత ఘట్టం ఆవిష్కృతమైంది(stock market news today). బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్(bse sensex today) 60వేల మార్కును దాటి సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. నిఫ్టీ కూడా 17,850 మార్కును చేరి సరికొత్త శిఖరాన్ని తాకింది. వరుస లాభాల పరంపరను కొనసాగిస్తూ శుక్రవారం సెన్సెక్స్ 163 పాయింట్ల లాభంతో 60,048కి చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధి చెంది 17,853కి చేరి జీవితకాల గరిష్ఠానికి(nifty today) చేరుకుంది.
అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, దేశంలో వ్యాక్సినేషన్ జోరందుకోవడం, కొత్త తరం స్టాక్ మార్కెట్లలోకి(stock market news) అడుగుపెడుతుండడం వంటి కారణాలు మార్కెట్లను మరింత శక్తిమంతంగా అవతరించేలా చేశాయి. ఇదే జోరు కొనసాగితే ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్‌గా మన మార్కెట్లు త్వరలోనే ఐదో స్థానానికి చేరే అవకాశముంది.
శుక్రవారం లాభాలు గడించిన షేర్లలో ఏషియన్ పెయింట్స్, ఎం&ఎం, ఎయిచర్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.
టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి.
సెన్సెక్స్ 60వేల మార్కు దాటి అరుదైన ఘనత సాధించిన సందర్భంగా బీఎస్ఈ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. గాల్లోకి బెలూన్లు వదిలి, కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.




బుల్‌కు వ్యాక్సినేషన్ బలం..
కరోనా ప్రభావంతో 2020 మార్చిలో పాతాళానికి పడిపోయిన సూచీలు(stock market today) చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. కొన్ని నెలల పాటు మందకొడిగా సాగిన మార్కెట్లు(stock market news).. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. సూచీలకు వ్యాక్సినేషన్ కొత్త బలాన్నిచ్చింది. వ్యాపారాలన్నీ పుంజుకుంటుండడం వల్ల సూచీలూ అదే బాటలో పయనిస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తూ వస్తున్నాయి(stock market live).
కొత్త తరం..
కొత్త తరం స్టాక్ మార్కెట్లలోకి(stock market) అడుగుపెడుతుండడం కూడా సూచీల పరుగుకు కారణమవుతోంది. తక్కువ వయసులోనే కుర్రాళ్లు మదుపు వైపు మళ్లడం బుల్ పరుగుకు తోడైంది. సాధారణంగా యువకులు రిస్క్ తీసుకోవడంలో కొంత ధైర్యంగానే ఉంటారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఏమాత్రం వెనుకాడడం లేదు. గత కొన్నేళ్లుగా కొన్ని కోట్ల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయంటే.. యువకుల ఆసక్తి ఎలా ఉందో తెలుస్తోంది.
ఐపీఓల పరంపర..
గత సంవత్సర కాలంగా ఐపీఓల పర్వం(stock market ipo) కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 40 కంపెనీలు ఐపీఓ పూర్తి చేసుకున్నాయి. దాదాపు రూ.70 వేల కోట్లు సమీకరించినట్లు అంచనా. ఇక పేటీఎం, ఓయో వంటి మరికొన్ని పెద్ద ఐపీఓలు త్వరలో రాబోతున్నాయి. దీంతో మార్కెట్ల విలువకు ఈ కొత్త కంపెనీల క్యాపిటలైజేషన్ కూడా తోడవుతోంది. బుల్ జోరు.. కొత్త తరం ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేందుకు అంకుర సంస్థలూ ఐపీఓల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పరంగా భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో నిధుల సమీకరణ కోసం కంపెనీలు ఐపీఓల బాట పట్టాయి.
ఐటీ అండ..
కొవిడ్ అనంతరం వ్యాపారాలన్నీ డిజిటలైజేషన్ దిశగా పరుగులు పెడుతున్నాయి. ఆన్‌లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ లావాదేవీలు.. ఇలా ఎక్కడ చూసినా టెక్ ఆధారిత సేవలే. దీంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కొత్త మార్పులను అందిపుచ్చుకోవడం కోసం వ్యాపారాలన్నీ ఐటీ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో ఐటీ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. కంపెనీల షేర్లు సైతం అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ భరోసా..
కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రత్యేక ఉపశమన ప్యాకేజీలు ప్రకటించింది. పీఎల్‌ఐ పేరిట దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించింది. వీటికితోడు బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ, ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరి, టెలికాంకు ప్రత్యేక రాయితీలు.. వంటి చర్యలు స్టాక్ మార్కెట్‌లో మదుపుచేసేవారికి భరోసానిచ్చాయి.
సానుకూల రుతుపవనాలు..
పై కారణాలతో జోరుమీదున్న బుల్‌కు వానలు మరింత ఆనందిన్నిచ్చాయి. ఈ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవ్వడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న అంచనాలు సైతం మార్కెట్లకు మరింత శక్తినిచ్చింది.
తాజా పరిణామాలు..
ఇటీవల ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ సంక్షోభానికి పరిష్కారం లభించే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లకు బలాన్నిచ్చింది. ఈ క్రమంలో దేశీయ లోహ, స్థిరాస్తి రంగ షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లూ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
మోదీ అమెరికా పర్యటనలో(Modi US Visit) పలు బడా సంస్థల సీఈఓలను కలుస్తుండడం కూడా మదుపర్లలో ఉత్సాహం నింపింది. భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటన వాణిజ్యపరంగా కలిసొచ్చే అవకాశం ఉందన్న నిపుణుల అంచనాలు బుల్ పరుగుకు దోహదం చేస్తున్నాయి.
మరోవైపు పలు కీలక రేటింగ్ సంస్థలు దిల్లీలో తిష్ఠవేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో కేంద్ర ఆర్థికశాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ రేటింగ్‌లు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా తర్వాత పెట్టుబడులకు అనుకూలంగా మారిన భారత వాణిజ్య వాతావరణం నేపథ్యంలో రేటింగ్ సంస్థలు సైతం సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో త్రైమాసిక ఫలితాలు వచ్చే నెల వెలువడనున్నాయి. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో విధించిన మలిదశ ఆంక్షల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడంతో ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కూడా మదుపర్లలో విశ్వాసం నింపినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Stock Market news: సరికొత్త చరిత్ర- సెన్సెక్స్ 60 వేల ప్రస్థానం ఇలా..