దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు.... భారత్ అభియాన్ పథకం మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడం, మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 223 పాయింట్లు కోల్పోయి 30 వేల 899 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి 9 వేల 85 వద్ద ట్రేడవుతోంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం రెండో విడతలో భాగంగా వలసకూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమం కోసం రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ.9,10,250 కోట్లవుతుంది. అయితే ఈ ఉద్దీపనలు... డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తాయనే భరోసాను ఇవ్వలేకపోతున్నాయి.
లాభనష్టాల్లో...
ఓఎన్జీసీ, టాటాస్టీల్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, బ్రిటానియా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా రాణిస్తున్నాయి.
ఎమ్ అండ్ ఎమ్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటైర్టెన్మెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ కూడా లాభాలతో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 1.47 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 31.59 డాలర్లుగా ఉంది.