stock market crash today india: దేశీయ స్టాక్మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. కరోనా కొత్త వేరియంట్ దెబ్బకు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1688 పాయింట్లు కోల్పోయి.. 57,107 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద స్థిరపడింది.
ప్రధాన కారణాలు..
- మార్కెట్లు ఈ స్థాయిలో పతనవ్వడానికి ముఖ్య కారణం కరోనా కొత్త వేరియంట్. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్.. అత్యంత ప్రమాదకరమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకం వైరస్‌పై టీకా ప్రభావం కూడా తక్కువేనని తెలుస్తోంది. దీంతో ఆఫ్రికా దేశాలు ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి.
- ఐరోపా దేశాల్లో ఇప్పటికే వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలతో లాక్డౌన్ భయాలు మరింత పెరిగాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు అమ్మకాలవైపే భారీగా మెగ్గుచూపారు.
- దేశీయంగా లోహ, రియల్టీ, ఆటో, బ్యాంకు రంగ షేర్లు దారుణంగా పతనమయ్యాయి.
- ఓవైపు డాలర్ బలపడుతుండటం, మరోవైపు వైరస్ భయాలు పెరుగుతుండటం వల్ల విదేశీ మదుపరులు భారత స్టాక్‌మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఓ కారణం. గురువారం రూ. 2,300కోట్ల అమ్మకాలు జరిపారు. మొత్తం మీద గత నాలుగు ట్రేడింగ్ సెషన్స్‌లో రూ. 15,000 కోట్ల షేర్లను అమ్మేశారు.
ఇంట్రాడే సాగిందిలా...
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో.. దేశీయ సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.
ఉదయం 58,255 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్(bse sensex today live).. ఒక్క పాయింటు కూడా పెరగకుండా కిందకి పడింది. 56,994 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి చివరికి 57,107 వద్ద స్థిరపడింది.
ఉదయం 17,339 వద్ద ప్రారంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ(nse nifty live today).. 17,355 వద్ద గరిష్ఠాన్ని తాకి, అక్కడి నుంచి క్రమంగా కిందపడింది. 16,985 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి వద్ద 17,026 ముగిసింది.
లాభనష్టాలు..
డా. రెడ్డీస్, నెస్లే, సిప్లా, దివీస్ ల్యాబ్‌లు లాభాలు గడించాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి, టాటాస్టీల్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్ నష్టాలు చవిచూశాయి.