దేశంలోని రాష్ట్రాలన్నీ కలిసి గత పదేళ్లలో రూ.4.7 లక్షల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాయని భారతీయ స్టేట్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. పారిశ్రామిక నిరర్ధక ఆస్తులతో పోలిస్తే ఇది 82 శాతం అధికమని తెలిపింది.
2019 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల నిరర్ధక ఆస్తులు 12.4 శాతం పెరిగి రూ.1.1 లక్షల కోట్లకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం నిరర్ధక ఆస్తులు దాదాపు రూ.8.79 లక్షల కోట్లని లెక్కగట్టింది. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిరర్ధక ఆస్తులు రెట్టింపు కన్నా అధికంగా పెరిగాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ.5,66,620 కోట్లుగా ఉన్న మొత్తం నిరర్ధక ఆస్తుల్లో పంట రుణాలు 8.6 శాతం(రూ.48,800 కోట్లు)గా ఉన్నాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.
"వ్యవసాయ నిరర్ధక ఆస్తులు కేవలం రూ.1.1 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ... పలు రాష్ట్రాలు మాఫీ చేసిన రూ.3.14 లక్షల కోట్ల పంట రుణాలను పరిగణలోకి తీసుకుంటే గత దశాబ్ద కాలంలో బ్యాంకులపై రూ.4.2 లక్షల కోట్ల భారం పడింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.45,000-రూ.51,000 కోట్ల రుణమాఫీతో కలిపి రూ.4.7 లక్షల కోట్లకు చేరింది. ఇవి 82 శాతం పారిశ్రామిక స్థాయి నిరర్ధక ఆస్తులతో సమానం."
-స్టేట్ బ్యాంక్ నివేదిక
ఆత్మహత్యల నివారణ సహా రైతులను రుణ భారం నుంచి విముక్తులను చేయడానికి 2015 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలోని పలు పెద్ద రాష్ట్రాలు రూ.3,00,240 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2008 ఆర్థిక సంవత్సరంలో మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రం ప్రకటించిన మాఫీలను కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు రూ.4 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. ఇందులో రూ.2 లక్షల కోట్లను 2017 నుంచే మాఫీ చేసినట్లు స్పష్టం చేసింది.
ఏయే రాష్ట్రాలు ఎంతెంత?
2015 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.24,000 కోట్లు, తెలంగాణ రూ.17,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది.
- తమిళనాడు రూ.5,280 కోట్లు (2017)
- మహారాష్ట్ర రూ.34,020 కోట్లు (2018), రూ.45,000-రూ.51,000(2019)
- ఉత్తర్ప్రదేశ్ రూ.36,360 కోట్లు (2018)
- పంజాబ్ రూ.10,000 కోట్లు (2018)
- కర్ణాటక రూ.18,000 కోట్లు (2018)
- రాజస్థాన్ రూ.18,000 కోట్లు (2019)
- మధ్యప్రదేశ్ రూ.36,500 కోట్లు (2019)
- ఛత్తీస్గఢ్ రూ.6,100 కోట్లు (2019)
వీటితో పాటు 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.44,000 కోట్ల రుణమాఫీలు జరిగినట్లు స్పష్టం చేసింది.
కాగితాలకే పరిమితం
అయితే ఈ రుణమాఫీలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఇందులో కేవలం 60 శాతం రుణాలు మాఫీ అయినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్లో అత్యల్పంగా 10 శాతం రుణాలు మాఫీ అయినట్లు స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన సంవత్సరాలలో కొత్త రుణాలు తీసుకునే శాతం గణనీయంగా పడిపోయినట్లు వెల్లడించింది.
రైతులకు ఉపసంహరణ పథకాలు ప్రవేశపెడుతున్నందున కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పంట రుణాలు తీసుకోవడం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 60 శాతం రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారానే తీసుకుంటున్నట్లు తెలిపింది.
కౌలు సాగే ప్రధాన కారణం
70 శాతానికి పైగా భూమిలో కౌలు సాగు చేస్తున్నందునే రైతులు తమ పంట రుణాలు చెల్లించలేకపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ సాగు ద్వారా కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదని తెలిపింది. కేరళ మినహా ఏ రాష్ట్రం కూడా రైతుల క్షేమం కోసం చట్టపరమైన చర్యలు చేపట్టడం లేదని వెల్లడించింది. రుణాలు అధిక రేట్లకు ఇవ్వకుండా మనీ లెండింగ్ చట్టాన్ని కేరళ రాష్ట్రం తీసుకొచ్చినట్లు గుర్తు చేసింది.
ఇదీ చదవండి: '5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అత్యాశే'