2024 సంవత్సరానికల్లా భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆశయం నిజం కావాలంటే 9 శాతం వృద్ధి అనివార్యమని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ నాగరాజ్ విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని ఊహకందని అత్యాశగా అభివర్ణించారు.
"గత దశాబ్ద కాల సమాచారాన్ని విశ్లేషిస్తే.. లక్ష్యం అత్యంత కష్టతరమని తెలుస్తోంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2020-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య భారత్ 9 శాతం వృద్ధి నమోదు చేయాలి. వృద్ధి రేటు దిగజారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. లక్ష్యం ఊహించలేని అత్యాశగా కనిపిస్తోంది."
-ఆర్.నాగరాజ్, ఆర్థికవేత్త, ఇందిరాగాంధీ పరిశోధనాభివృద్ధి సంస్థలో ఆచార్యులు.
ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన... తిరోగమనంలో ఉన్నప్పుడు వృద్ధి అవకాశాలు చాలా అరుదుగా కనిపిస్తాయాని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా వడ్డీ రేట్లలో కోతలు విధించడం ద్వారా సరైన ఫలితాలు సాధించలేదని వివరించారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఉద్దీపన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రానున్న 3-4 సంవత్సరాలకు జీడీపీ నిష్పత్తితో పోలిస్తే అధిక పెట్టుబడులను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని భావిస్తున్నట్లు తెలిపారు.
మందగమనంలో ఆర్థికం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. కేవలం 5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5 శాతం నమోదైన వృద్ధి... ఆ తర్వాతి త్రైమాసికంలో 4.5 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతమే