నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈక్విటీ బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ సెషన్లో దాదాపు 500 పాయింట్ల వరకు పుంజుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 537 పాయింట్లు లాభపడి 41 వేల 214 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 154 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 417 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్, వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్ రాణిస్తున్నాయి.
టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
అవసరమైతే ఇరాన్ సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పెంటగాన్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్ స్ట్రీట్ కూడా నిన్న లాభాలతో ముగిసింది.
రూపాయి విలువ
రూపాయి విలువ 20 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.71.73గా ఉంది.
దిగొచ్చిన ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో (బ్రెంట్ క్రూడ్ ఫీచర్స్) ముడిచమురు ధర 1.20 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 68.08 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: షేర్ ట్రేడింగ్ సర్వీసుల్లోకి పేటీఎం!