స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజులు నమోదు చేసిన లాభాల జోరుకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి.. 43,357 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 12,691 వద్దకు చేరింది.
ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
దేశ చరిత్రలోనే తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందన్న ఆర్బీఐ నిపుణుల అంచనాలూ నష్టాలకు కారణమయ్యాయి. ఆర్థిక షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్రం మూడో దశ ఉద్దీపన చర్యలను ప్రకటించినా మార్కెట్లపై ఆ ప్రభావం అంతగా కనిపించలేదు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 43,544 పాయింట్ల అత్యధిక స్థాయి, 43,127 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,741 పాయింట్ల గరిష్ఠ స్థాయి 12,624 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్యూఎల్, ఐటీసీ, ఎల్&టీ, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి.
ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. టోక్యో మినహా షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ అతి స్వల్పంగా 0.07 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 43.77 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:చరిత్రలోనే తొలిసారి మాంద్యంలోకి భారత్!