ఏజీఆర్ బకాయిలపై నేడు సుప్రీం విచారణ - ఏజీఆర్ బకాయిలు
ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికాం విభాగం వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఏజీఆర్ రూపంలో రూ.1.47 లక్షల కోట్లను టెల్కోలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొంది డీఓటీ.
ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన కేసును నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఏజీఆర్ బకాయిల కింద రూ. 1.47 లక్షల కోట్లను టెలికాం సంస్థలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని టెలికాం విభాగం(డీఓటీ) గతేడాది వ్యాజ్యం దాఖలు చేసింది.
ఏజీఆర్ బకాయిలకు సంబంధించి అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. బకాయిల రూపంలో టెలికాం విభాగం సూచించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు 3 నెలల సమయం ఇచ్చింది. అయితే గడువులోపు టెల్కోలు బకాయిలు చెల్లించటంలో విఫలమైన నేపథ్యంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహంతో బకాయిలు చెల్లించేందుకు టెల్కోలు సిద్ధమయ్యాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ కొంత మొత్తాలను చెల్లించాయి.
అక్టోబర్ తీర్పు..
2019 అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం. ఇందులో ఏజీఆర్పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
ఏజీఆర్ అంటే..
స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులను కలుపుకొని ఏజీఆర్ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని టెలికాం శాఖకు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్) కింద ఏజీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది.