ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమయింది. తొలిరోజే 38.87 శాతం షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 10,02,79,411 షేర్లకు గాను 3,94,54,830 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.
మొదటిరోజే రికార్డు స్థాయిలో 8.52 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది. ఐపీఓ ధర రూ.750- 755 మధ్య ఉండగా మొత్తం 19 షేర్లను కలిపి ఒక లాట్‌గా నిర్ణయించారు. లాట్ ధర గరిష్ఠంగా రూ.14,345గా ఉంది.
ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.
ఎస్బీఐ కార్డు ఐపీవో విశేషాలు
- ఐపీఓ ప్రారంభం: మార్చి 2
- ఐపీఓ ముగింపు: మార్చి 5
- ఐపీఓ ధర: రూ.750 - రూ.755
- ఐపీఓ ముగిశాక మే 16న షేర్లు మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
లాట్ పరిమాణం- లిస్టింగ్ వివరాలు
- ఈ బిడ్‌లో మీకు ఎన్ని లాట్లు కావాలో నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకోవాలి.
- ఒక వేళ షేరు ధర అత్యధికంగా నమోదైతే లాటుకు గరిష్ఠంగా రూ.14,345 వరకు అవ్వవచ్చు.
- ఈ ఐపీఓకు 'లింక్ లైన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్'గా వ్యవహరిస్తుంది.
లక్ష్యం
- ఈ ఐపీఓ ద్వారా మొత్తం 13 కోట్ల వాటాలను ఎస్బీఐ విక్రయిస్తోంది.
- ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యం.
- ప్రస్తుతం దీనికి భారతీయ మార్కెట్లో ఉన్న వాటా 18 శాతం
ఎస్బీఐ... రిజర్వేషన్స్
- ఈ ఇష్యూలో మొత్తం 10 శాతం షేర్లను (1.3 కోట్ల వాటాలు) ఎస్బీఐ షేర్ హాల్డర్ల కోసం రిజర్వ్ చేశారు.
- ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫిబ్రవరి 18 నాటికి ఎస్బీఐ వాటాదారులు అయ్యుండాలి.
- అర్హులైన ఉద్యోగుల కోసం 18.4 లక్షల షేర్లు కేటాయించారు
- ఎస్బీఐ ఉద్యోగికి ఒక్కో షేరుపై రూ.75 డిస్కౌంట్ ఉంటుంది.