యువతలో ఎక్కువగా ఆదరణ పొందిన గేమ్ పబ్‌జీని భారత్ నిషేధించిన నేపథ్యంలో పబ్‌జీ కార్పొరేషన్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో పబ్‌జీ, పబ్‌జీ లైట్ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్‌సెంట్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన 118 యాప్‌లను భారత్ నిషేధించిన వారం రోజుల వ్యవధిలోనే పబ్‌జీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత బుధవారం కొన్ని చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని టెన్‌సెంట్ ప్రకటించింది. దీంతోనే పబ్‌జీ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
'తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో పబ్జీకి ఫ్రాంచైజీగా ఉన్న టెన్‌సెంట్ నుంచి గేమ్ పబ్లిషింగ్ అధికారాలను వెనక్కి తీసుకుంటున్నాం. భవిష్యత్‌లో ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా చూస్తాం. పబ్‌జీ గేమింగ్ అనుభవాన్ని నేరుగా భారతీయులకు అందించేందుకు పబ్‌జీ కార్పోరేషన్ ప్రయత్నాలు చేస్తోంది' అని పబ్‌జీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. చైనాతో సంబంధమున్న టెన్‌సెంట్‌ను పక్కన పెట్టడంతో పబ్‌జీ మళ్లీ ప్లే స్టోర్/యాప్ స్టోర్‌లో ప్రత్యక్షమవుతుందా? లేదా అనేది త్వరలో తెలుస్తుంది.
పబ్‌జీ, పబ్‌జీ లైట్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ మన దేశంలో 'పబ్‌జీ'ని ఆడేందుకు ఇంకా వీలుంది. వేటుకు గురైన ఈ రెండూ మొబైల్ వర్షన్లే. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఈ ఆటను ఇకపై కూడా ఆడుకోవచ్చు. 'పబ్‌జీ' పేరెంట్ గేమ్‌కు చైనాతో సంబంధాలు లేవు. దక్షిణ కొరియాలోని పబ్‌జీ కార్పొరేషన్‌కు సంబంధించిన సర్వర్లను అది ఉపయోగించుకుంటుంది. దీంతో ఈ ఆటపై కేంద్రం పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదు. పబ్‌జీని భారత్‌లో గేమర్లు డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో భేషుగ్గా ఆస్వాదించేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
ఇదీ చూడండి:- ఈ ఐదు చిట్కాలతో పబ్‌జీ వ్యసనం నుంచి విముక్తి!