నియంత్రణ అవసరాలకు తగినవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు(పీఎస్‌యూ) కేంద్రం మూలధన సాయం (Capital infusion in Public Sector Banks) అందించే అవకాశముంది. వచ్చే త్రైమాసికంలో బ్యాంకుల (Public Sector Banks) మూలధన స్థాయిని సమీక్షించి.. నియంత్రణ అవసరాలను తీర్చడానికి సాయం (Capital infusion to banks) అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2021-22 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు.. మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకులు లాభాలను (Public Sector Banks profit 2021) నమోదు చేశాయి. తాజా పరిస్థితులు పీఎస్‌యూ బ్యాంకులు ఆర్థికంగా మెరుగుపడినట్లు సంకేతాలను చూపుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత నెలలో యూసీఓ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును తక్షణ దిద్దుబాటు చర్య ఫ్రేమ్‌వర్క్(పీసీఏఎఫ్) నుంచి రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తొలగించింది. వివిధ అంశాల్లో మెరుగైన ప్రదర్శన కారణంగా కనీస మూలధన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం ఆర్బీఐ తీసుకుంది. దీంతో పీసీఏ ఫ్రేమ్‌వర్క్ కింద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇంకా మిగిలి ఉంది. బ్యాంకులు ఆస్తిపై రాబడి, కనీస మూలధనం, నిరర్థక ఆస్తుల విలువ వంటి కొన్ని నియంత్రణ నిబంధనల ఉల్లఘించినప్పుడు పీసీఏ కిందకు ఆర్బీఐ చేర్చుతుంది. ఇష్టానూసారం రుణాలు ఇవ్వడాన్ని నిరోధించి.. ఆంక్షలు విధిస్తుంది.
గతేడాది రూ.20 వేల కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులలో రూ .20,000 కోట్లు సాయం చేసింది కేంద్రం. ఇందులో 11,500 కోట్లు పీసీఏ కింద ఉన్న.. యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకే వెళ్లాయి.
2018-19 వరకు 11 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రూ.3.15 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం నిధులు సమకూర్చింది. 2019-20లో ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా రుణాల వృద్ధిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్లను మూలధన సాయంగా అందించింది.
ఇదీ చూడండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్!