డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.760 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.4,896 కోట్లుగా ఉంది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.4,800 కోట్లు, నికరలాభం రూ.1,092 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయంలో 2 శాతం వృద్ధి కనిపించగా, నికరలాభం 30 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ.9,314 కోట్లు ఉండగా, దీనిపై రూ.1,342 కోట్ల నికరలాభం నమోదైంది.
రెండో త్రైమాసిక ఫలితాలపై డాక్టర్ రెడ్డీస్ సహ-ఛైర్మన్ జీవీ ప్రసాద్ స్పందిస్తూ, ఇప్పటికే విడుదల చేసిన కొవిడ్-19 ఔషధాలకు తోడు కొత్త ఔషధాలను ఆవిష్కరించడానికి తమ పరిశోధనా బృందాలు కృషి చేస్తున్నాయని వివరించారు. ఔషధాల తయారీ, విక్రయ కార్యకలాపాలు రెండో త్రైమాసికంలో మెరుగుపడ్డాయని, కానీ డిమాండ్ మాత్రం ఇంకా కొవిడ్ ముందు స్ధాయిలకు చేరుకోలేదని కంపెనీ వివరించింది. ఉత్తర అమెరికా, ఐరోపా ఆదాయాల్లో మెరుగైన వృద్ధి ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఆదాయాల్లో సాధారణ వృద్ధి మాత్రమే కనిపించింది. ప్రస్తుత రెండో త్రైమాసికంలో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై రూ.440 కోట్లు వెచ్చించారు. ఈఆర్థిక సంవత్సరంలో అమెరికాలో మొత్తం 30 ఔషధాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
సమాచారం భద్రమే
డాక్టర్ రెడ్డీస్‌పై ఇటీవల సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విదేశీ సైబర్ నిపుణులను సంప్రదించామని, సమాచారం ఏదీ పోలేదని, డేటా కేంద్రాలను తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది.
స్పుత్నిక్ వి టీకాపై క్లినికల్ పరీక్షలు మార్చికి పూర్తి..
రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ వి’ కోవిడ్-19 టీకాపై మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చేపట్టే క్లినికల్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. క్లినికల్ పరీక్షలు ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమై, మార్చి నాటికి పూర్తవుతాయని కంపెనీ సీఎఫ్‌ఓ సౌమెన్ చక్రవర్తి వివరించారు.
కొత్త సీఎఫ్‌ఓ నియామకం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు పరాగ్ అగర్వాల్ కొత్త సీఎఫ్‌ఓ (ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) గా ఎంపికయ్యారు. డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన నియామకాన్ని డాక్టర్ రెడ్డీస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.