గతేడాది డిసెంబర్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 13.59 శాతం పెరిగాయి. మొత్తం 2,52,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 చివరి నెలలో 2,22,728 యూనిట్లు విక్రయమైనట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) గురువారం ప్రకటించింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం 47,82,110 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ పేర్కొంది. 2019 చివరి త్రైమాసికంలో విక్రయమైన వాహనాల సంఖ్య 42,18,157గా తెలిపింది.
సియామ్ గణాంకాల ప్రకారం..
2020 డిసెంబర్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 7.42 శాతం పెరిగాయి. 11,27,917 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 అదే సమయంలో 10,50,038 యూనిట్లు విక్రయమయ్యాయి.
గత నెల మొత్తం 7,44,237 మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో విక్రయమైన 6,97,819 యూనిట్లతో పోలిస్తే ఇది 6.65 శాతం అధికం.
స్కూటర్ల విక్రయాలు 2019 డిసెంబర్‌తో పోలిస్తే.. గత నెల 3,06,550 యూనిట్లు నుంచి 3,23,696 యూనిట్లకు (5.59 శాతం వృద్ధి) పెరిగాయి.
ఎగుమతులు డీలా..
గత ఏడాది మొత్తం 38,65,138 వాహనాలు ఎగుమతి చేసినట్లు సియామ్ పేర్కొంది. 2019లో ఎగుమతైన 47,63,960 యూనిట్లతో పోలిస్తే ఇది 18.87 శాతం తక్కువ.
2020లో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు అత్యధికంగా 47.89 శాతం క్షీణించాయి. మొత్తం 2,76,808 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. 2019లో 5,31,226 ప్యాసింజర్ కార్లు ఎగుమతి అవ్వడం గమనార్హం.