రవాణా వాహనాల అమ్మకాలు జనవరిలో భారీగా పడిపోయాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. గతనెలలో 2,90,879 వాహనాలు అమ్ముడుపోయాయని.. ఇది గతేడాది జనవరితో పోలిస్తే 4.61 శాతం తక్కువని తెలిపింది.
2019 జనవరిలో 3,04,929 రవాణా వాహనాల విక్రయాలు జరిగాయని తెలిపింది. 1,223 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా గణాంకాలను ప్రకటించింది ఫాడా.
"త్రీవీలర్లు మినహా అన్ని వాహనాల అమ్మకాలు పడిపోయాయి. బీఎస్-4 నుంచి బీఎస్-6కు మార్పు కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోంది. "
- ఆశిష్ హర్షరాజ్ కాలే, ఫాడా అధ్యక్షుడు
ద్విచక్రవాహనాలు 8.82 శాతం తగ్గినట్లు స్పష్టం చేసింది. గతేడాది జనవరిలో 13.89 లక్షలు అమ్ముడవగా.. ప్రస్తుతం 12.67 లక్షలకు పడిపోయినట్లు తెలిపింది.
వాణిజ్య వాహనాల్లో 6.89 శాతం తగ్గుదల నమోదైంది. 2019 జనవరిలో 88,271 విక్రయించగా.. ఈ ఏడాది 82,187 అమ్మకాలు జరిగాయి.
త్రీవీలర్లో మాత్రం 9.17 శాతం పెరుగుదల కనిపించింది.
మొత్తంగా చూస్తే 7.17 శాతం వాహనాల అమ్మకాలు పడిపోయాయి.