కరోనా విజృంభిస్తున్న వేళ వెనిజువెలా అధ్యక్షుడు కొత్త తరహా దౌత్యానికి తెరతీశారు. మరోసారి పాతకాలపు వస్తుమార్పిడి వ్యవస్థను తెరపైకి తెచ్చారు. చమురు ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన వెనిజువెలా దాన్నే ఇప్పుడు టీకాలకు పెట్టుబడిగా మార్చుకునేందుకు సిద్ధమైంది. తమకు టీకాలు ఇచ్చిన వారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆదివారం ప్రకటించారు.
"వెనిజువెలా వద్ద చమురు ఉంది. దాన్ని కొనేందుకు వినియోగదారులూ సిద్ధంగా ఉన్నారు. అయితే, మా ఉత్పత్తిలో కొంత భాగాన్ని టీకా పొందేందుకు వినియోగించాలనుకుంటున్నాం. టీకాలిచ్చే వారికి చమురు ఇస్తాం."
- నికోలస్ మదురో, వెనిజువెలా అధ్యక్షుడు
మరోవైపు.. వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్ వంటి దేశాలు అక్కడి నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి.
ఇప్పటి వరకు వెనిజువెలాలో రష్యా రూపొందించిన స్పుత్నిక్ టీకాతో పాటు చైనాలో అభివృద్ధి చేసిన మరో టీకా వినియోగానికి మాత్రమే అనుమతులు లభించాయి. ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకాను తాము అంగీకరించబోమని పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్(పీఏహెచ్‌ఓ)కు ఇప్పటికే వెనిజువెలా తెలిపింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెనిజువెలా పెద్ద మొత్తంలో రుణపడి ఉంది. దీంతో సంస్థ అనుమతించిన టీకాలు సైతం ఇప్పటి వరకు అక్కడికి చేరలేదు.
వెనిజువెలాలో వైద్యారోగ్య సిబ్బందికి టీకాలివ్వడం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారన్నది మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వెనిజువెలాలో ఇప్పటి వరకు 1,50,000 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,500 మంది మృతి చెందారు. అయితే, ఈ గణాంకాలపై అక్కడి ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసులు ఇంకా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. పైగా ఇటీవలి కాలంలో కేసులు మరోసారి భారీ స్థాయిలో విజృంభిస్తున్నాయి. బ్రెజిల్ వేరియంట్ ప్రబలరూపంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: కరోనాలోనూ కేఎఫ్సీ విస్తరణ- కొత్తగా 30 రెస్టారెంట్లు!