ఎయిర్ ఇండియాను మూసివేయడం లేదని స్పష్టం చేసింది సంస్థ. అప్పుల్లో కూరుకుపోవడం వల్ల ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను మూసేస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించింది. అవన్నీ నిరాధారమైన వదంతులేనని.. ఈ మేరకు వెబ్సైట్లకు, ట్రావెల్ ఏజెంట్లకు ఓ లేఖ రాశారు సంస్థ కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షీ మాలిక్.
"ఎయిర్ ఇండియా మూసేస్తారంటూ మార్కెట్లో వదంతులు వ్యాప్తిస్తున్నాయి. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకుండా ఎయిర్ ఇండియా ఆర్థిక, నిర్వహణ పరిస్థితిని సమర్థంగా నిర్వహిస్తున్నాం."-మీనాక్షీ మాలిక్, ఎయిర్ఇండియా కమర్షియల్ డైరెక్టర్
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది.