ప్రస్తుతం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తున్న పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) చాలా వరకు ప్రైవేటు రంగం ఏర్పాటు చేసినవేనని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.
ప్రైవేటీకరణ అంశాన్ని సమర్థిస్తూ.. "ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వం ఎటువంటి క్షమాపణలూ చెప్పబోవడం లేదు. ప్రభుత్వ రంగం చెమటోడ్చి వీటిని నిర్మించిందని కొందరంటున్నారు. అయితే మేం ప్రైవేటీకరించాలని భావిస్తున్న చాలా వరకు సంస్థలను ప్రైవేటు రంగం ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణ చెబుతూ.. "ఎయిర్ ఇండియాను ప్రైవేటు రంగం నుంచి తీసుకుని 1953లో జాతీయకరణ చేశారు. 1969లోనూ బ్యాంకులను ప్రైవేటు రంగం నుంచే తీసుకుని.. జాతీయకరణ చేశారు. ఈ సంస్థలను భారత ప్రభుత్వ సంస్థల చెమట, రక్తంతో నిర్మించారని చెప్పే వారికి.. వాటిని ప్రైవేటు రంగమే నిర్మించిందని స్పష్టం చేస్తున్నా" అని ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పేర్కొన్నారు.
"ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రైవేటీకరణ కోసం వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను నిర్ణయించారు. వ్యూహాత్మక రంగంలో ప్రభుత్వ వాటాలను చాలా తక్కువకే పరిమితం చేయనున్నాము" అని తెలిపారు సంజీవ్. అవసరమైన చోట కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడానికీ ప్రభుత్వం వెనకాడబోదని అన్నారు. "కొన్ని కారణాల వల్ల ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌లో సమస్యలు కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్ వంటి కొన్ని ఉదంతాలు చాలా జరిగాయి. కాబట్టి బ్యాంకింగ్ వంటి రంగాల్లో ప్రభుత్వ ఉనికి కనిపించాల్సిన అవసరం ఉంది" అని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: ice cream gst rate: 'ఐస్‌క్రీమ్‌లపై 18% జీఎస్‌టీ'