సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన ఓ తప్పుడు సమాచారం... కేరళలోని మున్నార్ తపాలా కార్యాలయం ముందు స్థానిక జనాలు బారులు తీరేలా చేసింది. తపాలా కార్యాలయంలో నూతన ఖాతా తెరిస్తే ప్రధానమంత్రి ఖాతా నుంచి నేరుగా డబ్బులు జమవుతాయన్న తప్పుడు సందేశం ప్రచారం కావడమే ఇందుకు నేపథ్యం.
గత కొన్ని రోజులుగా స్థానికులు మున్నార్ తపాలా కార్యాలయం ముందు బారులు తీరుతున్నారు. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు. వందలాదిగా జనం బారులు తీరడం వల్ల పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
సోమవారం దేవికులం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తోందన్న తప్పుడు సమాచారంతో చాలా మంది కార్మికులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బారులు తీరారు. అయితే ఇది తప్పుడు సమాచారం అని సబ్‌కలెక్టర్ రేణురాజ్ స్పష్టం చేశారు.
అవాస్తవాలను ప్రచారం చేసి... ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భాజపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి.. జవాను మృతి