హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ లారస్ ల్యాబ్స్ గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.4,814 కోట్ల ఆదాయాన్ని, రూ.984 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.18.3గా నమోదైంది. 2019-20తో పోల్చినప్పుడు ఆదాయం 70 శాతం, నికరలాభం 286 శాతం పెరగడం ప్రత్యేకత. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,412 కోట్ల ఆదాయంపై రూ.297 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. రూ.5.5 ఈపీఎస్ నమోదైంది. వాటాదార్లకు ఒక్కో షేరుకు 80 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. కంపెనీని ఇదేవిధంగా వృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాలనేది తమ లక్ష్యమని, అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఫలితాల సందర్భంగా 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావ తెలిపారు. రెండేళ్లలో బిలియన్ డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) కంపెనీగా అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యాంశాలివీ
2020-21 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి ఆదాయాలు, లాభాలు ఎలా సాధ్యమయ్యాయి?
కొన్నేళ్లుగా మేం చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. 2018, 2019 సంవత్సరాల్లో దాదాపు రూ.1300 కోట్లు వెచ్చించి సామర్థ్యాన్ని పెంచుకున్నాం. అప్పట్లో అందరూ 'ఎందుకు ఇలా ప్లాంట్లు నిర్మిస్తున్నారు' అని ప్రశ్నించారు. ఆ రోజు మేం సామర్థ్యాన్ని సమకూర్చుకోకపోతే ఈ రోజు కంపెనీ ఈ స్థాయికి పెరిగేది కాదు. ఆకర్షణీయ ఆదాయాలు, లాభాలు ఆర్జించే పరిస్థితి వచ్చేది కాదు. అధిక సామర్థ్యం, కొత్త ఔషధాలు, ప్రణాళికబద్ధ కృషి దీనికి కారణాలని చెప్పగలను. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఎంఐసీ టెండర్ వ్యాపారం అధిక వృద్ధి కనబరచింది. ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) వ్యాపారం బాగా పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయాల అంచనాలు చెబుతారా?
ముందస్తు అంచనాలు చెప్పలేను. కానీ 30% ఎబిటా (వడ్డీ, పన్ను, కేటాయింపుల కంటే ముందు ఆదాయం) కొనసాగిస్తాం. వచ్చే రెండేళ్లలో... అంటే 2023 మార్చి నాటికి బిలియన్ డాలర్ (రూ.7,500 కోట్ల టర్నోవర్) కంపెనీగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
మూలధన వ్యయ ప్రణాళికలు..?
2020-21లో విస్తరణపై రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టాం. వచ్చే రెండేళ్లలో రూ.1700 కోట్లతో విస్తరణ కార్యక్రమాలు చేపడతాం. మలిదశ వృద్ధికి ఈ విస్తరణ దోహదపడుతుంది. దీనికి పూర్తిగా సొంత నిధులే ఖర్చు చేస్తాం. కొత్త యూనిట్ల నిర్మాణం, యంత్రసామగ్రి కొనుగోలు, ఇతర మూలధన అవసరాలకు ఈ సొమ్ము వెచ్చిస్తాం. థర్డ్ పార్టీ ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) అమ్మకాలు పెరుగుతున్నందున ఏపీఐ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం.
సమీప భవిష్యత్తులో ఏ వ్యాపార విభాగాలు అధిక వృద్ధికి వీలుకల్పిస్తాయని మీరు అంచనా వేస్తున్నారు.?
కస్టమ్ సింథసిస్ వ్యాపారం బాగా పెరుగుతుందని భావిస్తున్నాం. క్రామ్స్ (కాంట్రాక్టు పరిశోధన- తయారీ సేవలు) కూడా బాగుంటుంది. బెంగుళూరుకు చెందిన రిచ్‌కోర్ లైఫ్‌సైన్సెస్ (ప్రస్తుతం లారస్ బయో) ఈ ఏడాది మే నెల నుంచి పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుంది. దీనివల్ల ఫెర్మెంటేషన్ విభాగంలో మాకు శక్తియుక్తులు సమకూరినట్లు అవుతుంది. రీ-కాంబినెంట్ ప్రోడక్ట్స్ తీసుకురాగలుగుతాం.
కొవిడ్-19 ఔషధాలు కానీ, ఇతర కొత్త ఔషధాల తయారీకి సంబంధించి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
కొవిడ్-19 ఔషధాలు మేం తయారు చేయడం లేదు. కొత్త ఔషధాల విషయానికి వస్తే.. 2023 నుంచి మధుమేహం, హృద్రోగ వ్యాధుల ఔషధాలు పెద్దఎత్తున తయారు చేస్తాం. ప్రధానంగా మా కంపెనీకి మలిదశ వృద్ధి ఈ కొత్త ఔషధాల నుంచి ఉంటుందని చెప్పగలను. కస్టమ్ సింథసిస్ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.
క్రామ్స్ వ్యాపారానికి సంబంధించి మీ ప్రణాళికలు ఏమిటి?
క్రామ్స్ వ్యాపార కార్యకలాపాల కోసం రెండు అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేశాం. దీని కోసం విశాఖపట్నం వద్ద 40 ఎకరాల స్థలాన్ని తీసుకున్నాం. దాదాపు రూ.150 కోట్లతో పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. దీనివల్ల క్రామ్స్ కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుంది.
ఇవీ చదవండి: కొవిడ్-19 టీకా తయారీకి ఐఐఎల్ సన్నాహాలు
కరోనాకు మనో ధైర్యమే మందు: డాక్టర్ ఎంఎస్ రెడ్డి