ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను సంబంధిత సంస్థకు నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఆ పాలసీ క్లెయిమ్ అభ్యర్థనను తిరస్కరించొచ్చని అత్యున్నత న్యాయస్థానం (SC Judgement) స్పష్టం చేసింది. పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడే.. అందులోని నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని సూచించింది. ఓ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోగా.. అతనికి బీమా వర్తించే కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) సదరు వ్యక్తికి బీమా చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది.
బీమా తీసుకునే సమయంలో వినియోగదారుడు, సంస్థ చేసుకున్న ఒప్పందం పూర్తిగా చట్టబద్దమైనదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తొలుత చేసుకున్న ఒప్పందాన్ని తిరిగి రాయడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఎన్సీడీఆర్సీ ఇచ్చిన ఆదేశాలను అప్పీల్ చేస్తూ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. కమిషన్ ఆదేశాలను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
కేసు వివరాలు ఇవే..
ఎల్ఐసీ నుంచి ఓ వ్యక్తి పాలసీ తీసుకున్నారు. ఈ బీమా విలువ రూ. 3.75 లక్షలు. ప్రమాదవశాత్తు వ్యక్తి మరణిస్తే.. అదనంగా మరో రూ. 3.75 లక్షలను సంస్థ ఇస్తుంది. ఈ పాలసీ ప్రకారం ప్రీమియం ఆరు నెలలకు ఓసారి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి చెల్లించడంలో విఫలమయ్యారు. అయితే 2012 మార్చి 6న రోడ్డు ప్రమాదానికి గురైన అతను 21 మార్చిలో చనిపోయారు. బీమా ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని(రూ.3.75 లక్షలను) ఎల్ఐసీ చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రావాల్సిన మొత్తాన్ని(అదనగా రూ.3.75 లక్షలను) సంస్థ తిరిస్కరించింది. దీనిపై మృతుడి భార్య జిల్లాస్థాయి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ.. మిగతా మొత్తం చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది ఎల్ఐసీ. అయితే ఈ తీర్పును సమర్థించింది ఎస్సీడీఆర్సీ. అనంతరం ఎన్సీడీఆర్స్ను ఆశ్రయించగా అదే తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఎల్ఐసీ. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగిన నాటికి పాలసీ అమలులో లేదని తేల్చింది. అయితే ఫిర్యాదుదారు తిరిగి పునరుద్ధరించాలి ప్రయత్నించినట్లు గుర్తించింది. దీంతో సంస్థ పాలసీని తిరస్కరించడం సబబే అని తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: ఆర్బీఐ 'శక్తి'ని పరీక్షించనున్న 3 కీలక సవాళ్లివే..