దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో 23.7 శాతం వృద్ధితో రూ.4,466 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ సాధించిన లాభాల(రూ.3,610 కోట్లు) కన్నా ఇది అధికమని స్పష్టం చేసింది.
ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 7.9 శాతం పెరిగి రూ.23,092 కోట్లకు చేరిందని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. అంతకుముందు ఏడాది మూడో త్రైమాసికంలో రూ.21,400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలను సవరించింది ఇన్ఫోసిస్. అక్టోబర్లో అంచనా వేసిన 9-10 శాతాన్ని పెంచింది. స్థిరమైన కరెన్సీ వద్ద వృద్ధి 10-10.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
"క్లైంట్లతో సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకోవడానికి మేము చేసే ప్రయాణంలో వేగంగా ముందుకెళ్తున్న విషయాన్ని మూడో త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి."-సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ
2019 డిసెంబర్ నాటికి సంస్థలో 2,43,454 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. కొత్తగా 6,968 మందిని చేర్చుకున్నట్లు తెలిపింది.
ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు
అనామక ప్రజావేగుల(విజిల్బ్లోయర్స్) ఆరోపణలపై సంస్థ ఆడిట్ కమిటీ స్వతంత్ర దర్యాప్తు పుర్తి చేసినట్లు ప్రత్యేక నివేదికలో వెల్లడించింది ఇన్ఫోసిస్. ఇందులో ఆర్థికపరమైన అక్రమాలు, పాలనాపరమైన దుష్ప్రవర్తనలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: జనవరిలో 10 అదిరిపోయే స్మార్ట్ఫోన్లు విడుదల!