భారత్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 6.4 శాతం చొప్పున వేతనాల పెంపు ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. ఇది 2020లో 5.9 శాతంగా ఉండటం గమనార్హం. విల్లీస్ టవర్స్ వాట్సన్ అనే సంస్థ చేసిన ఈ సర్వేలో వేతనాలపెంపుపై పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
'కొవిడ్ 19 వల్ల ఏర్పడిన పరిస్థితులకు తగ్గట్లు భారతీయ కంపెనీలు ప్రతిస్పందిస్తున్నందున.. వ్యాపారాల రికవరీ అశాజనకంగా ఉంది. అయితే ఆ సానుకూలతలు వేతనాల పెంపునకూ రావాల్సి ఉంది.' అని విల్లీస్ టవర్స్ వాట్సన్ ఇండియా ప్రతినిధి రాహుల్ మాథుర్ అన్నారు. గత ఏడాది కన్నా కాంపెన్సేషన్ బడ్జెట్ తక్కువగా ఉండడం వల్ల.. కంపెనీలు ఎక్కువ నైపుణ్యాలున్న వారికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముందని తెలిపారు.
సర్వే ముఖ్యాంశాలు..
ఈ ఏడాది అధిక నైపుణ్యాలున్న 10.3 శాతం ఉద్యోగులకు(దేశవ్యాప్తంగా) 20.6 శాతం వేతనాల పెంపు ఉండొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఓ మోస్తరు పనితీరు కనబర్చే ఉద్యోగులకు రూ.1 కేటాయిస్తే..టాప్ పర్ఫార్మర్కు రూ.2.35, మోస్తరు కన్నా కాస్త ఎక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగులకు రూ.1.25 చొప్పున ఈ ఏడాది కేటాయింపులు ఉండొచ్చు.
ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఈ ఏడాది వేతన పెంపు.. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం నుంచి 7 శాతానికి తగ్గొచ్చు.
మిడిల్ మేనేజ్మెంట్, వృత్తి నిపుణులు, సపోర్ట్ స్టాఫ్కూ ఈ ఏడాది వేతనాలు 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి.
రంగాల వారీగా చూస్తే.. టెక్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో వేతనాలు దాదాపు 8 శాతం పెరగొచ్చు.
ఆర్థిక సేవల విభాగంలో 7 శాతం, బీపీఓ రంగంలో 6 శాతం చొప్పున విద్యుత్ రంగంలో అత్యల్పంగా 4.6 శాతం వేతనాల పెంపునకు అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి:కొత్త ఏడాదిలో జోరుగా వాహన విక్రయాలు