ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)ను చిన్న రుణ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించినట్లు తపాలా విభాగం తెలిపింది. 100 రోజుల్లో ఐపీపీబీలో కోటి ఖాతాలు ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా వ్యక్తులతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలకూ తక్కువ మొత్తం రుణాలను వారి ఇళ్లు, కార్యాలయాల వద్దే ఇవ్వడం వీలవుతుంది.
జులై 29-31 మధ్య శ్రీనగర్‌లో నిర్వహించిన వార్షిక సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల ప్రణాళికతో పాటు 100 రోజుల కార్యచరణ మార్గ సూచీని రూపొందించారు. ప్రధానమంత్రి 'నూతన భారత్' అంకురార్పణలో భాగంగా ఈ కార్యక్రమం సాగాలని నిర్ణయించుకున్నారు.
బ్యాంకింగ్, నిధుల బదిలీ, బీమా, నేరుగా రాయితీల సరఫరా, బిల్లులు, పన్నుల చెల్లింపులు లాంటి పౌర కేంద్రీకృత సేవలు అందించడానికి ఇండియా పోస్ట్‌ను.. సాధారణ సేవా కేంద్రం(కామన్ సర్వీస్ సెంటర్)తో భాగస్వామ్యం చేయనున్నట్లు తపాలా విభాగం తెలిపింది.
ఇ-కామర్స్ పరిశ్రమను టైర్-2, టైర్-3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని తపాలా విభాగం నిర్ణయించింది. ఇందుకోసం 190 పార్సిల్ హబ్‌లు, 80 నోడల్ డెలివరీ సెంటర్లు, పాన్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది.
ఇదీ చూడండి: 'ఆ లేఖ' సిద్ధార్థ రాశారా? సంతకం ఆయనదేనా?
.