ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్ ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం 9 శాతం చొప్పున వృద్ధి చెందాల్సి ఉంటుందని లెక్కగట్టింది ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'ఈవై'. మొత్తం పెట్టుబడి రేటును దేశ జీడీపీలో 38 శాతానికి పెంచాల్సి ఉంటుందని ఎకానమీ వాచ్ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. అప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల నెరవేరుతుందని అభిప్రాయపడింది.
2020 మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవుతుందని అనుకుంటే... భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఈవై తన తాజా ఎడిషన్లో పేర్కొంది. గతేడాది భారత్ 2.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది.
9 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే..
ఐదేళ్ల పాటు ఏటా 9 శాతం చొప్పున్న వృద్ధి చెందితే.... భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2021 ఆర్థిక సంవత్సరంలో 3.3 ట్రిలియన్, 2022లో 3.6 ట్రిలియన్, 2023లో 4.1 ట్రిలియన్, 2024లో 4.5 ట్రిలియన్, 2025 ఆర్థిక సంవత్సరంలో 5 ట్రిలియన్ డాలర్లుకు చేరుకుంటుందని ఈవై అంచనా వేసింది.
"ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంటుందని అనుకుంటే... 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి 9 శాతానికి దగ్గరగా ఉన్న నిజమైన వృద్ధి రేటు అవసరం. ఇది నామమాత్రపు వృద్ధిరేటు 13 శాతాన్ని సూచిస్తుంది."
-ఈవై 'ఎకానమీ వాచ్' నివేదిక
పెట్టుబడులు ఇలా...
2021 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధి సాధించాలంటే... పెట్టుబడి రేటు జీడీపీలో 38 శాతానికి దగ్గరగా పెంచాల్సి ఉంటుందని అంచనా వేసింది ఈవే.
2019 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి రేటు 31.3గా ఉంది.
ఇదీ చూడండి: విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ఇండియా