వృద్ధి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు దేశం ఒక తెలివైన లాక్డౌన్ నిష్క్రమణ వ్యూహం అమలుచేయాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ తన పరిశోధన నివేదికలో పేర్కొంది.
"కరోనా సంక్షోభం వేళ జీవితాలు, జీవనోపాధి గురించి చర్చ జరిగింది. ఇప్పుడు జీవితాల గురించే చర్చిస్తున్నారు. మరోసారి లాక్డౌన్ పొడిగిస్తే వృద్ధి పతనాన్ని ఆపలేం. అందుకే ఇప్పుడు దేశం ఒక తెలివైన లాక్డౌన్ నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం."
- ఎస్బీఐ
వృద్ధి పతనం మరింతగా..
భారత ఆర్థిక వృద్ధి 2019-20లో 11 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి అంటే 4.2 శాతానికి పడిపోయింది. కరోనా సంక్షోభం, వరుస లాక్డౌన్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోయింది. ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి (జీడీపీ) 3.1 శాతానికి పడిపోయింది. ఇది గత 40 త్రైమాసికాల్లోనే అత్యంత కనిష్ఠం.
గత అనుభవాలు
గత అనుభవాలను చూసుకుంటే, ఆర్థికమాంద్యం సంభవించిన ప్రతిసారీ... తిరిగి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్లు పట్టింది.
వ్యవసాయ రంగం మాత్రమే..
లాక్డౌన్ సంక్షోభం ధాటికి మిగతా రంగాలన్నీ కుదేలవ్వగా... ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే తట్టుకొని నిలబడగలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం- దాని అనుబంధ రంగాల వృద్ధి 2.4 శాతం ఉంటే ... ఈ ఏడాది 4 శాతానికి పెరిగింది.
"కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) మునుపటి త్రైమాసికాల వృద్ధి రేటును (మూడో త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే) గణనీయంగా సవరించింది. ఈ కొత్త సమాచారం చాలా అస్పష్టంగా ఉంది. సీఎస్ఓ ఈ విషయంపై పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది."
- ఎస్బీఐ
మార్పులు గమనించలేదా?
సాధారణంగా మూడోసారి వృద్ధి అంచనాలను విడుదల చేసిన తరువాత ... మే లో త్రైమాసిక సంఖ్యలను మార్చడం ఆనవాయితీ. అయితే లాక్డౌన్ కారణంగా నాల్గొవ త్రైమాసికంలో జరిగిన నష్టాన్ని మిగతా త్రైమాసిక ఫలితాలకు పంపిణీ అయ్యుండవచ్చు. అంటే 2019-20లో రూ.1.08 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం అవుతోంది.
"ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్న విషయాన్ని సీఎస్ఓ గ్రహించలేదా? దీనికి కేవలం సీఎస్ఓ మాత్రమే సమాధనం ఇవ్వగలదు. అందుకే గత రెండు-మూడేళ్లలో డేటా ఎందుకు అస్థిరంగా మారిందో... ఆ కారణాలను సీఎస్ఓ ఓ పద్ధతి ప్రకారం వివరించాలని మేం కోరుతున్నాం."
- ఎస్బీఐ
సీఎస్ఓ ఆర్థిక వృద్ధి అంచనాలు సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కాలపరిమితిని పెంచింది. అందువల్ల ఆగస్టులో త్రైమాసిక, వార్షిక గణాంకాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయని ఎస్బీఐ భావిస్తోంది.
ఇదీ చూడండి: తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నిక లాంఛనమే!