ప్రముఖ ఎరువుల ఉత్పత్తి సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)..నానో టెక్నాలజీతో అభివృద్ధి చేసే లిక్విడ్ యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్లోని పరిశోధన కేంద్రంలో దీనిని అభివృద్ధి చేసినట్లు ఇఫ్కో పేర్కొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే దీనిని సాధించినట్లు తెలిపింది.
ఏమిటీ కొత్త యూరియా?
మొక్కలు పెరిగేందుకు కావాల్సిన ముఖ్య పోషకాల్లో నత్రజని కీలకమైనది. ఈ పోషకాన్ని సమృద్ధిగా అందేంచేదే యూరియా. ప్రస్తుతం ఈ యూరియా తెల్లటి రంగులో గుళికల రూపంలో లభిస్తోంది.
రైతుల ఆదాయం పెరుగుతుంది:ఇఫ్కో
ఈ కొత్త రకం యూరియా.. పంట దిగుబడిని, రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ఇఫ్కో ఆశాభావం వ్యక్తం చేసింది. పంట పెరుగుదల కీలక దశలో ఈ లిక్విడ్ యూరియాను వాడటం వలన.. మొక్కలకు నత్రజని సమర్థంగా అందిస్తుందని వివరించింది. సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఇది తక్కువ ధరకే లభిస్తుందని వెల్లడించింది. నానో యూరియా (లిక్విడ్) రవాణా కూడా చాలా సులభమని ఇఫ్కో పేర్కొంది. 45-50 కిలోల సంప్రదాయ యూరియాతో పోలిస్తే.. లిక్విడ్ యూరియా 500 మిల్లీ లీటర్లు సరిపోతుందని తెలిపింది. దీని వల్ల రవాణా భారం కూడా ఉండదని చెప్పుకొచ్చింది.
ఇఫ్కో చెప్పిన మరిన్ని విశేషాలు..
* సాధారణ ఘన యూరియాతో పోలిస్తే.. ఈ లిక్విడ్ యూరియా పర్యావరణహితం.
* సాధారణ యూరియా కన్నా.. నానో యూరియా (లిక్విడ్) 80 శాతం సమర్థవంతం. అందుకే తక్కువ మొతాదులో వాడితే సరిపోతుంది.
* సాధారణ యూరియా వాతావరణ, నీటిలో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. కానీ నానో యూరియాను నేలపై, నీటిలో కలవకుండా పంట ఆకులపై పిచికారీ చేస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి:ఇలా చేస్తే బ్యాటరీ కార్ల మైలేజ్ రెట్టింపు!