ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లు లేదా టీవీలే దిక్కు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఎక్కడైనా సౌకర్యంగా సినిమాలు, ఇతర కంటెంట్ ఆస్వాదించగలుగుతున్నాం. ఓటీటీ(ఓవర్ ద టాప్)(OTT) ప్లాట్‌ఫామ్‌లు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. మన దేశంలో కరోనా వల్ల గత కొంత కాలంగా ఈ యాప్‌లు చాలా పాపులారిటీ సంపాదించుకున్నాయి. కొత్త సినిమాలు నేరుగా వీటిలో విడుదల అవటం కూడా దీనికి దోహదపడింది. భవిష్యత్తులో మన దగ్గర ఓటీటీలకు సంబంధించి భారీ వృద్ధి ఉంటుందని అంచనా. ఓటీటీలు లేదా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మౌలికంగా వివిధ వ్యాపార మోడళ్లను అనుసరిస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..
యాడ్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్
ఈ పద్ధతిలో ప్రకటనల ద్వారా ప్లాట్‌ఫామ్‌లు రెవెన్యూ పొందుతాయి. ఈ మోడల్లో వినియోగదారులు ఉచితంగా వీడియోలను చూడవచ్చు. అయితే.. వీడియో మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి.
ఈ మోడల్ ద్వారా కొత్త వినియోగదారులను పొందటం చాలా సులభం. కొత్త ఛానల్‌ను ప్రారంభించి త్వరగా వృద్ధిలోకి రావొచ్చు. అయితే ఈ మోడల్ ద్వారా ఒక యూజర్ ద్వారా తక్కువ మొత్తంలో రెవెన్యూ ఉంటుంది. ఎక్కువ ప్రకటనలు ఇచ్చినట్లయితే వినియోగదారుడు ఆసక్తి చూపించకపోవచ్చు. బ్యాలెన్స్డ్గా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ బిజినెస్ మోడల్‌కు యూట్యూబ్(నాన్-ప్రీమియం) ఇందుకు మంచి ఉదాహరణ.
సబ్ స్క్రిప్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్
ఇది చాలా ఫేమస్ మోడల్. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటివి వీటికి ఉత్తమ ఉదాహరణలు. తమ ప్లాట్ ఫామ్‌లో ఉన్న కంటెంట్‌ను వీక్షించేందుకు సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇవి రెగ్యులర్‌గా నిర్ణీత సమయానికి చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ చెల్లించిన వారు ఎలాంటి పరిమితి లేకుండా కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ప్రతి కస్టమర్ నుంచి ఈ మోడల్ ద్వారా ఆదాయం అందుతుంది. కొత్తగా చేరే వారికి సబ్స్క్రిప్షన్ ఫీజు తగ్గించవచ్చు. దీని వల్ల కొత్త వినియోగదారులు పెరుగుతారు.
ఈ మోడల్లో వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌ను విడిచి వెళ్లటం అనేది తరచూ జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెంచటం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం తదితర పరిస్థితుల్లో సబ్‌స్క్రిప్షన్‌ను ముగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నట్లయితే కొత్త వారిని పొందటం కష్టమవుతుంది. కంటెంట్ ఆకర్షణీయంగా ఉన్నంత వరకు కస్టమర్లు ఉంటారు.
పే పర్ వ్యూ లేదా ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్
వీడియో కొనుగోలు చేసేందుకు, వీక్షించేందుకు ఒక్కసారి చెల్లించాల్సి ఉంటుంది. దీనినే పే పర్ డౌన్లోడ్ అని కూడా అంటారు. ఒక్క వీడియో ద్వారా రెవెన్యూ కావాలనుకుంటే ఈ మోడల్ ఉత్తమం. పూర్తి ప్లాట్ ఫామ్‌కు కావాల్సిన కంటెంట్ లేని పక్షంలో ఈ మోడల్ ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా వస్తున్న సినిమాలకు, ఒకే సారి జరిగే స్పోర్ట్స్ ఈవెంట్ తదితరాలకు సరిపోతుంది.
పై రెండు రెవెన్యూ మోడళ్లతో పోల్చితే ఇది స్థిర ఆదాయం తీసుకురావటంలో విఫలమైంది. వినియోగదారులు ఈ మోడల్‌కు ఎక్కువ మొగ్గు చూపటం లేదు.
జీప్లెక్స్, బుక్ మై షో స్ట్రీమ్ లాంటివి ఈ మోడల్‌ను ఉపయోగించుకుంటున్నాయి.
హైబ్రిడ్ మోడల్
పై మోడళ్లను కలిపితే వచ్చేదే ఈ హైబ్రిడ్ మోడల్. కొన్ని కంపెనీలు దీన్ని అనుసరిస్తున్నాయి. భారత దేశంలో రెవెన్యూపరంగా టాప్‌లో ఉన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇదే కోవలోకి వస్తుంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ను తీసుకుంటే యాడ్ రెవెన్యూతో పాటు సబ్ స్క్రిప్షన్ రెవెన్యూ కూడా అందుతుంది.
ఇదీ చూడండి: ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు