ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. వారాల వ్యవధిలోనే ముడిసరకుల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై నిర్మాణ బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబడటం లేదని మధ్యతరగతి వారు వాపోతున్నారు. స్టీల్, సిమెంట్, పీవీసీ, విద్యుత్తు ఉపకరణాలు, రంగులు ఇలా ప్రతి వస్తువు ధరలూ ఏడాదికాలంలో భారీగా పెరిగాయి. చదరపు అడుగుకు సగటున రూ.400-500 నిర్మాణ వ్యయం పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు. 120 గజాల స్థలంలో వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే అదనంగా రూ.నాలుగైదు లక్షల భారం పడుతోంది. దీంతో కొత్తగా సొంతింటి నిర్మాణం మొదలు పెట్టాలనుకునేవారు.. ఈ పరిస్థితుల్లో కట్టాలా వద్దా అనే సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు.
సొంతంగా కట్టించుకున్నా..
కొవిడ్ అనంతరం సొంత ఇంటి అవసరం పెరగడంతో తమకు ఉన్న స్థలాల్లో చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్టారు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన వాటిని తిరిగి చేపడుతున్నారు. ఆ సమయంలో కూలీల కొరతతో ఒక్కసారిగా లేబర్ ఛార్జీలు పెరిగాయి. అక్కడి నుంచి మొదలైన ధరల పెరుగుదల ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌తో ఆంక్షలు, ఆ తర్వాత డీజిల్ ధరల పెంపుతో ప్రతి వస్తువు ఖరీదూ పెరిగింది. కొవిడ్‌కు ముందు సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే చదరపు అడుగు రూ.1200-1300 వరకు అయ్యేది. గుత్తేదారు అయితే రూ.1500 వరకు చేసేవారు. ఇంటీరియర్స్‌కు అదనం. పెరిగిన ధరలతో సొంతంగా పొదుపుగా కట్టించుకున్నా రూ.1500-1600 వరకు అవుతోంది. గుత్తేదారుకు ఇస్తే రూ.1800 దాకా తీసుకుంటున్నారు.
రూ.లక్షల భారం..
ఎనిమిది నెలల క్రితం సిమెంట్ బస్తా రూ.330-340 ఉండగా.. ఇప్పుడు రూ.370 నుంచి 400 వరకు ఉంది. టన్ను స్టీల్ మొన్నటివరకు రూ.65 వేలకు పెరిగింది. కొవిడ్‌కు ముందు రూ.45 వేల స్థాయిలోనే ధర ఉండేది. ప్రస్తుతం టన్ను రూ.59 వేల దిగువకు రావడం కొంతలో కొంత ఊరట. ఇసుక, రోబోసాండ్ ధరలల్లోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దొడ్డు ఇసుక టన్ను ఇదివరకు రూ.1350 ఉంటే.. ఇప్పుడు రూ.1500పైనే ఉంది. సన్న ఇసుక రూ.1600-2000 వరకు ఉంది. కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, జీఐ, ప్లాస్టిక్ పైపులు, కాపర్ కేబుల్స్, శానిటరీ, టైల్స్ ధరలు 15 నుంచి 50 శాతం పెరిగాయని నిర్మాణదారులు చెబుతున్నారు. ‘నేను మొదటి స్లాబ్ వేసినప్పుడు స్టీల్ టన్నుకు రూ.50 వేలకు కొంటే.. నెలక్రితం చివరి స్లాబ్ వేసినప్పుడు రూ.63 వేలకు కొన్నాను’ అని చందానగర్‌లో ఇల్లు కట్టుకుంటున్న ప్రతాప్ తెలిపారు.
కేంద్రం చొరవ చూపాలి
"రవాణాపై ఎక్కువగా ఆధారపడే వాటిలో ప్రధానమైనది నిర్మాణ రంగం. డీజిల్ ధరలు పెరగడంతో పీవీసీ 40 శాతం పెరిగింది. కాపర్ 40 నుంచి 50 శాతం ఎక్కువైంది. స్టీల్, సిమెంట్ వంటి కీలకమైన వాటిలో పెంపుదల చాలా ఎక్కువగా ఉంటోంది. వీటి ధరల స్థిరీకరణ జరగాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నాం. అనివార్య పరిస్థితుల్లో అదే నిష్పత్తిలో ధరలు పెరిగితే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఎక్కువగా పెంచుతున్నారని అర్థమవుతోంది. నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది."
-జి.రాంరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, క్రెడాయ్
పాతిక శాతం పైనే...
"హైదరాబాద్ అందుబాటు ఇళ్లకు చిరునామాగా ఉండేది. భూముల ధరలు పెరగడం, ప్రభుత్వమే భూములను వేలం వేయడంతో ప్రైవేటు స్థలాల రేట్లు సైతం పెరిగాయి. అందుబాటు ధరల్లో ఇంటి నిర్మాణం గగనంగా మారింది. నిర్మాణ రంగ ముడిసరకుల ధరలూ తోడవడంతో నిర్మాణ వ్యయం 25 నుంచి 35 శాతం పెరిగింది."
- మారం సతీష్, ఎండీ, మారం ఇన్‌ఫ్రా
- ఇదీ చదవండి : భారీగా పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు