పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ద్వారా వ్యూహాత్మక రంగాల్లో పనిచేస్తోన్న వారికి ఉద్యోగం పోయినా, మరే విధమైన నష్టం జరిగినా వాటిని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తీసుకువచ్చిన నూతన విధానం చాలా పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.
అణుశక్తి, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్,పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలను వ్యూహత్మక రంగాలుగా, మిగతా రంగాలను వ్యూహత్మకం కానివిగా వర్గీకరించామని స్పష్టం చేశారు ఠాకూర్.
"కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే సమయంలో ఆయా కంపెనీల్లోని ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే. ఇందుకు తగ్గట్టుగానే అమ్మకపు ఒప్పందం చేసుకుంటాం. వారికి తదనంతరం పొందే సౌకర్యాలు కూడా యథాతథంగా ఉంటాయి. ప్రైవేటీకరణ వల్ల పెట్టుబడి వస్తుంది. సరికొత్త సాంకేతికత అందుబాటులో ఉంటుంది. అంతేగాక మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి."
- అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ప్రస్తుతం ఉన్న దాని కంటే ఉద్యోగావకాశాల మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు ఠాకూర్.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్.
ఇదీ చూడండి: 'నౌక, విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాను అమ్మబోం'