సిరుల పండగ దీపావళికి బంగారం కొంటే మంచిదని నమ్మకం. ఈ మాట ఎలా ఉన్నా.. ఓ సురక్షితమైన మదుపు సాధనంగా పసిడికి పేరు.. ప్రస్తుతం దీనికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సార్వభౌమ పసిడి బాండ్లనూ తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆరో విడత. అక్టోబరు 25 వరకూ అందుబాటులో ఉండబోయే ఈ బాండ్ల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం..
మార్కెట్లో ఉన్న బంగారం ధరకన్నా కాస్త తక్కువకే కొనాలనుకునే వారు సార్వభౌమ పసిడి బాండ్ల (సావరీన్ గోల్డ్ బాండ్)ను పరిశీలించవచ్చు. భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబం, ట్రస్టులు, మైనర్ల పేరుమీద సంరక్షకులు, ధార్మిక సంస్థలు ఇందులో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు వీటిని జారీ చేస్తుంది.
ఎక్కడ కొనాలి?
గ్రామీణ బ్యాంకులు మినహా.. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల అధీకృత ఏజెంట్ల (డీమ్యాట్) ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.20వేల వరకూ బాండ్లను నగదు రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత డీడీ, చెక్కు, లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ రూపంలో చెల్లించి, కొనుగోలు చేయాలి. దరఖాస్తుదారుడు ‘పాన్’ వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి.
4 కిలోల వరకూ..
గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కనీసం ఒక యూనిట్‌ను కొనాలి. ఆర్థిక సంవత్సరంలోని అన్ని విడతల్లో కలిసి వ్యక్తులు గరిష్ఠంగా 4 కిలోల వరకూ కొనొచ్చు. ట్రస్టుల్లాంటివి గరిష్ఠంగా 20 కిలోల వరకూ మదుపు చేయొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు విడతలు ఈ బాండ్లను జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఏడో విడత డిసెంబరు 2న ప్రారంభం కానుంది.
ధర ఎంత?
భారత స్వర్ణ, ఆభరణాల సంఘం (ఐబీజేఏ) గత వారంలోని చివరి మూడు పనిదినాల్లో ప్రకటించిన 999 స్వచ్ఛత మేలిమి బంగారం సగటు ఆధారంగా ప్రస్తుత ధరను నిర్ణయించారు. ప్రస్తుతం ఒక యూనిట్‌కు రూ.3,835గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు, చెల్లింపు చేసిన వారికి ప్రభుత్వం రూ.50 రాయితీగా ప్రకటించింది.
వడ్డీ ఇస్తారు
యూనిట్ కొనుగోలు ధరను పరిగణనలోనికి తీసుకొని 2.50శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తుంది. దీన్ని ప్రతి ఆరు నెలలకోసారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ వడ్డీని వ్యక్తులు తమ మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాలి. పెట్టుబడిని వెనక్కి తీసుకునేటప్పుడు మూలధన రాబడిపై ఎలాంటి పన్నూ వర్తించదు. గడువుకు ముందే పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. నిబంధనల మేరకు మూలదన రాబడి పన్ను విధిస్తారు.
8 ఏళ్ల వరకూ
జారీ చేసిన తేదీ నుంచి ఎనిమిదేళ్ల వరకూ కొనసాగాలి. వ్యవధి తీరే నాటికి ఐబీజేఏ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా బాండ్ ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం కల్పిస్తారు.
అప్పులకు హామీగా పెట్టి, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంది. పిల్లల వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి సువర్ణావకాశమే.
లాభమేమిటి?
బంగారం పూర్తిగా బాండ్లు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది కాబట్టి, బంగారం నాణ్యత పరిశీలించే అవసరం లేదు. బంగారాన్ని దాచుకోవడానికి లాకర్ల అవసరం లేదు. 8 ఏళ్ల తర్వాత అప్పటి బంగారం ధరను బట్టి బాండు విలువ చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం అదనపు ఆకర్షణ.
ఇదీ చూడండి: సిగరెట్ ఇస్తే ఫుల్ట్యాంక్ పెట్రోల్ ఉచితం!