కరోనా బాధితుల చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్(Remdesivir) ఔషధాన్ని ఇక నుంచి రాష్ట్రాలే సొంతంగా తయారీ సంస్థల నుంచి సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేటాయింపులు నిలిపివేస్తున్నామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. "ఇప్పుడు దేశంలో రెమ్‌డెసివిర్ డిమాండ్‌కు మించి సరఫరా అవుతోంది. అందువల్ల రాష్ట్రాలకు కేంద్ర కేటాయింపులను నిలిపేస్తున్నాం" అని ఆయన ట్వీట్ చేశారు.
గత నెలతో పోలిస్తే రెమ్‌డెసివిర్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ 11న రోజుకు 33వేల వయల్స్ ఉత్పత్తి జరగగా.. నేడు అది 3,50,000 వయల్స్‌కు పెరిగినట్లు చెప్పారు. ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్య కూడా నెల రోజుల్లో 20 నుంచి 60 ప్లాంట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో డిమాండ్‌కు మించి రెమ్‌డెసివిర్ సరఫరా ఉండటంతో కేంద్రం నుంచి కేటాయింపులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వివరించారు. అయితే ఈ ఔషధం(Medicine) లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీడీఎస్‌సీఓ, జాతీయ మందుల ధరల ఏజెన్సీని ఆదేశించారు. అంతేగాక, అత్యవసర సమయంలో వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం కూడా 50లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కోటికి పైనే రెమ్‌డెసివిర్ వయల్స్‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించింది. కొవిడ్ చికిత్సలో ఈ ఔషధానికి రెండో దశ ఉద్ధృతిలో డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 11న ఈ ఇంజెక్షన్ల ఎగుమతిని కేంద్రం నిషేధించింది. అంతేగాక, దీనిపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గించింది.