బంగారం ధర చుక్కలనంటుతోంది. బుధవారం రూ. 300 పెరిగి 39, 970గా నమోదైన పసిడి... నేడు మరో రూ. 250 పెరిగి తొలిసారిగా రికార్డు స్థాయిలో 40వేల మార్కు దాటింది. పుత్తడి ధర రూ. 40,220 వద్ద ముగిసిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ ప్రకటించింది.
పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీ యూనిట్ల నుంచి వస్తోన్న డిమాండ్‌తో కిలో వెండి ధర రూ. 200 పెరిగి...రూ. 49050 వద్ద ముగిసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య భయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితుల నేపథ్యంలో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. పండుగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. రూపాయి విలువ బలహీనపడటం బంగారం ధర పెరగడానికి కారణంగా తెలుస్తోంది.
"బ్రెగ్జిట్‌పై భవిష్యత్‌లో జరగనున్న నిర్ణయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఆర్థిక విధానం భవిష్యత్తులో బంగారం ధరలను నిర్ణయిస్తాయి."
-తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు
అంతర్జాతీయ విపణిలోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1539 అమెరికన్ డాలర్లుగా ఉంది. వెండి 1.15 శాతం పెరిగి 18.63 డాలర్లుగా స్థిరపడింది.
ఇదీ చూడండి: చిదంబరం అరెస్టుపై ఇంద్రాణి ముఖర్జీ హర్షం