స్టాక్ మార్కెట్లపై ఈ వారం భారత్-చైనా సరిహద్దు వివాదం, కరోనా వైరస్ అప్డేట్లు ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి.
తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్క రోజే 90 వేలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు తేలింది. భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఈ కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయొచ్చని మార్కెట్ విశ్లేషకుల మాట.
గత వారం విడుదలైన జీడీపీ గణాంకాల ఆధారంగా ఆర్థిక వృద్ధి రికవరీకి చాలా సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంశం కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని తెలుస్తోంది.
'ఆర్థిక వృద్ధి రికవరీకి ఉద్దీపనలు అందించడంపై అంచనాల నేపథ్యంలో స్వల్ప కాలంలో మార్కెట్లు సానుకూలంగా స్పందించచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశం ఉంది.' అని మోతీలాల్ ఓశ్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసర్చ్ అధిపతి సిద్ధార్థ్ కింకా తెలిపారు.
ఈ వారమే ఆగస్టు నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలపై అంచనాలు కూడా మార్కెట్లకు కీలకమేనని విశ్లేషకులు చెబుతున్నారు
రూపాయి, ముడి చమురు ధరల కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.