స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ సంస్థల నగదు నిల్వలు గణనీయంగా పడిపోయాయి. 2019 సంవత్సరంలో భారతీయ సంస్థలు, వ్యక్తులు దాచుకున్న సొమ్ము 6 శాతం తగ్గి రూ.6,625 కోట్లకు పరిమితమైనట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ఈ మేరకు స్విస్ బ్యాంకుల్లోని నిల్వలపై వార్షిక గణాంకాలు వెలువరించింది.
వరుసగా రెండో ఏడాది కూడా భారతీయుల నగదు నిల్వలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంకు(ఎస్ఎన్బీ) 1978 నుంచి నమోదు చేస్తున్న గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మూడో అత్యల్పం.
2019 చివరి నాటికి మొత్తం డిపాజిట్లలో రూ. 4 వేల కోట్లు కస్టమర్ డిపాజిట్లు, ఇతర బ్యాంకుల ద్వారా రూ. 650 కోట్లు , ట్రస్టులకు రూ.50 కోట్లు , ఇతర బకాయిలు రూ. 19 వందల కోట్లను... సెక్యురిటీలు, ఇతర ఆర్థిక సాధనాల రూపంలో వినియోగదారులకు చెల్లించాల్సి ఉందని నివేదికలో వివరించింది.
భారతీయులు, బ్యాంకులు, సంస్థల నుంచి వచ్చిన డిపాజిట్ల వివరాలు ఇందులో ఉన్నట్లు ఎస్ఎన్బీ నివేదిక ప్రకారం తెలుస్తోంది. భారత్‌లోని స్విస్ బ్యాంకుల బ్రాంచీలు, నాన్ డిపాజిట్ అప్పుల గణాంకాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది.
నల్లధనం కాదు
అయితే.. ఇవన్నీ స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంకుకు ఇతర బ్యాంకులు ఇచ్చిన అధికారిక నివేదికల ఆధారంగా రూపొందించిన గణాంకాలు. ఇందులో భారతీయులు దాచుకున్న నల్లధన వివరాలేవీ ఉండవని అధికారులు తెలిపారు. ఇతర దేశాల్లోని సంస్థల పేరిట భారతీయులు, ఎన్ఆర్ఐలు ఆయా బ్యాంకుల్లో కూడబెట్టిన నగదు వివరాలను సైతం వెల్లడించదని వెల్లడించారు.
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బంతా నల్లధనం కాదని ఆ దేశ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో జరుగుతున్న పన్ను ఎగవేత సహా ఇతర మోసాలను అరికట్టేందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెబుతున్నారు.
భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పన్ను విషయాల్లో 2018 నుంచి సమాచార మార్పిడి ప్రారంభమైంది. ఇందులో భాగంగా 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్న భారతీయుల ఖాతాల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.
రూ.130 లక్షల కోట్లు
మొత్తంగా స్విస్ బ్యాంకుల్లో అన్ని దేశాల కస్టమర్ డిపాజిట్లు 0.3 శాతం పెరిగి రూ. 130 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ కస్టమర్ల డిపాజిట్లు 25.3 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్రకు పెరిగి 1.25 ట్రిలియన్ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు చేరాయి. విదేశీ డిపాజిట్లు మాత్రం తగ్గుముఖం పట్టాయి.
స్విస్ బ్యాంకుల్లో బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన డిపాజిట్లు పెరగ్గా... పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన వ్యక్తులు, సంస్థలు దాచుకున్న డిపాజిట్లు తగ్గిపోయాయి. పాకిస్థాన్ డిపాజిట్లు 45 శాతం తగ్గి రూ. 3 వేల కోట్లకు పరిమితమైనట్లు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించింది. బంగ్లాదేశ్ డిపాజిట్లు 2 శాతం తగ్గి రూ. 4,500 కోట్లకు చేరినట్లు వివరించింది.