భారత్.... ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ కోరింది. ఇందు కోసం బ్రాంచ్ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు సూచనలు తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు... శనివారం నుంచి నెల రోజుల పాటు ఈ సంప్రదింపుల కార్యక్రమం చేపడతాయి. మొదటి దశలో బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో చర్చలు జరుగుతాయి. రెండో దశలో రాష్ట్ర స్థాయి, మూడో దశలో జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో అధికారులు చేసే సూచనలు బ్యాంకింగ్ రంగ భవిష్యత్ వృద్ధికి మార్గదర్శకంగా ఉపయోగించుకుంటారు.
సంప్రదింపుల ప్రక్రియ లక్ష్యం... బ్యాంకింగ్ రంగాన్ని జాతీయ ప్రాధాన్యతలతో సమలేఖనం చేయడం. అలాగే ప్రాంతీయ సమస్యలు, వాటి వృద్ధి సామర్ధ్యాలను గుర్తించి బ్యాంకింగ్ సమకాలీకరణ చేయడం.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే రాబోయే ఐదేళ్లలో భారత ఆర్థికవృద్ధిలో... ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రధాన భూమిక పోషించాలని కేంద్రం కోరుకుంటోంది.
మెరుగైన సేవలు
బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికీ ఈ సంప్రదింపుల ప్రక్రియ దోహదం చేస్తుంది. బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్కూ ఇది దోహదపడుతుంది.
'రైతుల ఆదాయం రెట్టింపు, నీటి సంరక్షణ కార్యక్రమం కోసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలి. అలాగే విద్యారుణం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలి. అలాగే డిజిటల్ ఎకానమీ, ఆర్థిక వృద్ధికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని' కేంద్రం సూచించింది.
ఆర్థిక వృద్ధి మందగమనం
కేంద్రప్రభుత్వం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం కలలుగంటున్న తరుణంలో దేశ ఆర్థికవృద్ధి మందగమనంలో కొనసాగుతుండటం గమనార్హం. ముఖ్యంగా వాహన రంగం, వాహన విడిభాగాల తయారీ రంగం కుదేలైంది. స్థిరాస్తి రంగంలోనూ మందగమనం నడుస్తోంది.
ఉద్యోగాల కల్పన తగ్గుతోంది
పరిశ్రమలకు బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాలు గణనీయంగా పెరిగాయి. 2018 జూన్ త్రైమాసికంలో 0.9 శాతం నుంచి ఈ ఏడాది జూన్‌కు 6.6 శాతం వరకు బ్యాంకు రుణాలు పెరిగాయి. అయినప్పటికీ ఎమ్ఎస్ఎమ్ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 0.7 శాతం నుంచి 0.6 శాతానికి పడిపోయింది. మరోవైపు బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి.
ఇదీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్‌కు తాళం వేయండిక!