సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ 500 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. వినియోగదారుల సమాచారంపై గోప్యత పాటించని కారణంగా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్ టీసీ).. ఫేస్బుక్పై ఇంత మొత్తం పెనాల్టీ విధించింది.
జరిమానాకు తోడు... యూజర్ల గోప్యతకు కంపెనీ జవాబుదారీగా ఉండేలా నూతన నిబంధనలు రూపొందించి ట్రేడ్ కమిషన్కు సమర్పిస్తామని తెలిపింది ఫేస్‌బుక్.
నిబంధనల ఉల్లంఘన..
వ్యక్తిగత సమాచారం, గోప్యత నియంత్రణ పాటించకుండా 2012 ఎఫ్టీసీ ఉత్తర్వులను ఉల్లంఘించిందన్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చర్యలకు బదులుగా ఫేస్‌బుక్ ఇవన్నీ అంగీకరించింది.
వినియోగదారుల గోప్యత నిబంధనలు పాటించని కంపెనీలపై విధించే అత్యధిక జరిమానా ఇదే కాగా.. ఎఫ్టీసీ చరిత్రలో కూడా ఇదే అతిపెద్ద జరిమానా కావడం గమనార్హం.
వినియోగదారుల సమాచారాన్ని తప్పుదోవ పట్టించినందుకు కేంబ్రిడ్జ్ అనలిటికా కేసులో విధించిన 10 కోట్ల డాలర్ల జరిమానాను కూడా చెల్లించనున్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.
సగటున 210 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లేదా మెసెంజర్ వినియోగిస్తున్నారని అంచనా. 270 కోట్ల మందికి పైగా ప్రతి నెలా వీటన్నింటిలో ఏదో ఒకటి వాడుతున్నారట. అందుకే.. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం.. సమాచార భద్రత ప్రమాణాలు పక్కాగా పాటిస్తామని పేర్కొందీ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ.