ఈ వారం స్టాక్‌మార్కెట్లు రిలీఫ్ ర్యాలీ కారణంగా లాభాల వైపు పయనించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తీవ్ర హెచ్చుతగ్గులు తప్పవని.. మదుపర్లు కరోనా విషయంలో ఆందోళన పడుతుండటమే ఇందుకు కారణమంటున్నారు. అంతర్జాతీయ ఒడుదొడుకులు ఉన్నప్పుడు రిటైల్ మదుపర్లు తీవ్ర భయాందోళనకు గురికాకుండా.. ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్స్ షేర్లు నేడు మార్కెట్లో నమోదవుతుండడం కూడా మదుపర్ల దృష్టిని ఆకర్షించవచ్చు. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. కరోనా వైరస్ వల్ల నిర్మాణ, రవాణా, రసాయన తయారీ రంగాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక అంచనా వేసింది.
వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే...
- మార్కెట్‌తో పాటే ఫార్మా షేర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాల దృష్టితో మదుపర్లు కొనుగోలు చేయొచ్చు.
- సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల(ఏజీఆర్) కేసుపై మంగళవారం కోర్టు చేపట్టే విచారణ నుంచి టెలికాం షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
- కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై పడుతుందన్న అంచనాల మధ్య చమురు షేర్లలో ఒత్తిడి కొనసాగొచ్చు.
- రంగానికి ప్రత్యేకించిన వార్తలు లేనందున మార్కెట్‌తో పాటే యంత్ర పరికరాల షేర్లు కదలాడొచ్చు. జనవరిలో యంత్రపరికరాల ఉత్పత్తి 8 నెలల కనిష్ఠానికి చేరడం కూడా ఈ షేర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- బ్యాంకు షేర్లు సానుకూల ధోరణితో కదలాడొచ్చు. గత వారం దిద్దుబాటుకు గురైన ఈ షేర్లలో కొనుగోళ్లు జరగవచ్చు.
- సిమెంటు కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. గిరాకీ స్థిరంగా ఉంటుందన్న అంచనాలకు తోడు.. ప్రస్తుత స్థాయిల వద్దే ధరలు కొనసాగొచ్చని విశ్లేషకులు అంటుండడం ఇందుకు దోహదం చేయవచ్చు.
- కరోనా వ్యాప్తి వల్ల వినియోగం తగ్గే అవకాశం ఉండడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టపోవచ్చు.
- సరఫరా ఇబ్బందులు కొనసాగితే వాహన కంపెనీల షేర్లపై ప్రతికూలతలు ప్రసరించవచ్చు.
- లోహ, గనుల కంపెనీల షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు. అంతర్జాతీయ గిరాకీ మందగమనం పాలవుతోందన్న ఆందోళనలు ఇందుకు నేపథ్యం.
- ఐటీ కంపెనీల షేర్లు లాభాలందుకోవచ్చు. గత వారం భారీగా పతనం కావడం వల్ల తక్కువ ధరల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: వాట్సాప్ కొత్త ఫీచర్: మెసేజ్‌లు వాటంతటవే తొలగిపోతాయట!