దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందుల్లో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి అనువుగా పునరుద్ధరణ జరుగుతున్న సంకేతాలు(గ్రీన్ షూట్స్) కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు నిర్మల. ప్రభుత్వం చేపట్టిన విధానాల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. గత మూడు నెలలుగా లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు సాధించడం ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని అనేందుకు సంకేతమని వివరించారు.
"ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని సూచించే ఏడు ముఖ్యమైన సూచీలు గ్రీన్ షూట్స్ ఉన్న విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదు."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
విదేశీ మారక నిల్వలు జీవిత కాల గరిష్ఠానికి చేరాయని, స్టాక్ మార్కెట్లు ఉరకలేస్తున్నాయని తెలిపారు నిర్మల. ఇవన్నీ గ్రీన్ షూట్స్‌కు సంకేతాలని చెప్పారు. వృద్ధికి ఊతమిచ్చే నాలుగు ప్రధాన రంగాలైన ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు, ప్రైవేట్, ప్రజా వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థ అసమర్థుల చేతిలో ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నిర్మల. ఆర్థిక వ్యవస్థ సమర్థులైన చేతిలో ఉన్న యూపీఏ హయాంలోనూ ద్రవ్య లోటు అధిక స్థాయిలో ఉండేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: వాహనదారులకు శుభవార్త: తగ్గిన పెట్రోల్ ధరలు