'జాతీయ రిటైల్ విధానం' ముసాయిదాను రూపొందించడానికి పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం పోత్సాహక విభాగం-డీపీఐఐటీ సన్నాహాలు చేస్తోంది. దేశంలోని 6.5 కోట్ల మంది చిరు వ్యాపారుల వృద్ధిని ప్రోత్సహించడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ ముసాయిదాపై త్వరలో భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలను కోరనున్నట్లు.. డీపీఐఐటీ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ నూతన విధానం రిటైల్ వాణిజ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే ఈ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. లైసెన్సింగ్, నిధుల సమీకరణ, నేరుగా అమ్మకాలు చేపట్టడానికి వీలు కల్పిస్తుంది.
హైపర్ మార్కెట్ సంబంధిత విషయాలూ ఈ పాలసీలోని ప్రధాన అంశాలు. ఈ నూతన విధానం... రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులు పెంచడం, మౌలిక సదుపాయాల అడ్డంకులను తొలగించే మార్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
ప్రతిపాదిత 'జాతీయ రిటైల్ విధానం' ప్రతిపాదనను... వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో డీపీఐఐటీ సిద్ధం చేసింది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దీన్ని చేపట్టింది. ఇప్పటికే భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు పూర్తి చేసిన డీపీఐఐటీ.. త్వరలోనే ఈ ముసాయిదా రూపకల్పన ప్రక్రియ పూర్తి చేసి, ప్రజల ముందు ఉంచడానికి సన్నాహాలు చేస్తోంది.
"65 మిలియన్ల చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఈ రంగం అభివృద్ధికి... ఈ నూతన 'జాతీయ రిటైల్ విధానం' రూపొందించారు."
-డీపీఐఐటీ అధికారి
డీపీపీఐటీకి బాధ్యత..
ఫిబ్రవరిలో 'దేశీయ లేదా అంతర్గత వాణిజ్యం' అనే అంశాన్ని... వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి డీపీపీఐటీకి మార్చారు. ఇది రిటైల్ రంగాన్ని నియంత్రించే నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
డీపీఐఐటీ విభాగం ఇప్పటికే 'ఇ-కామర్స్'పై మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది. ఇదే సమయంలో రిటైల్ వాణిజ్యం కోసం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సరికొత్త నిబంధనలతో రావడం సముచితంగా ఉందని డీపీఐఐటీ అధికారి తెలిపారు.
రిటైల్ వ్యాపారం... షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్(షాపులు, సంస్థలు) చట్టం కింద ఉంటుంది. ఈ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరు వాటాదారుల అభిప్రాయాలు ముఖ్యమైనవే అని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: అంధుల కోసం ఆర్బీఐ 'కరెన్సీ యాప్'!