స్టాక్ మార్కెట్లపై కరోనా భయాలు ముప్పేటదాడి చేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సూచీలపై ఆర్థిక మందగమనం, కరోనా భయాలు, క్రూడ్ ధరల పతనం వంటివి మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఈ దెబ్బకు సూచీలు కుదేలైపోతున్నాయి.
నష్టపోయిన అమెరికా మార్కెట్లు
కరోనా ధాటికి వాల్‌స్ట్రీట్ స్టాక్స్ బుధవారం మరోసారి భారీగా నష్టపోయాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
బుధవారం డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 6.3 శాతం లేదా 1,300 పాయింట్లకు పడిపోయి 19 వేల 892 వద్ద ముగిసింది. 2017 తరువాత ఇలా 20,000 పాయింట్ల కంటే దిగువకు డో జోన్స్ పడిపోవడం ఇదే మొదటిసారి.
బ్రాడ్ బేస్డ్ ఎస్ అండ్ పీ 5.2 శాతం అంటే 500 పాయింట్లు పడిపోయి 2 వేల 398 వద్ద ముగిసింది. టెక్ రిచ్ స్టాక్ నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 4.7 శాతం పడిపోయి 6 వేల 989 వద్ద స్థిరపడింది.
భారీగా పతనమైన క్రూడ్ ఆయిల్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు నిన్న రాత్రి భారీగా పతనం అయ్యాయి. అమెరికా చమురు ధరలు బ్యారెల్ 20 డాలర్ల వద్దకు చేరింది. 2002 నాటి స్థాయికి పతనం అయ్యాయి. ఇవ్వన్నీ మార్కెట్లలో భయాలను రేపాయి. నేడు దేశీయ మార్కెట్లలో చమురు రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, రిలయన్స్ షేర్లు భారీగా విలువ కోల్పోవడం సూచీలపై ప్రభావం చూపింది.
ఫెడ్ రంగంలోకి దిగడం వల్ల..
అమెరికా ఫెడరల్ రిజర్వు నిన్న అర్ధరాత్రి రంగంలోకి దిగి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అత్యవసర రుణాలను మంజూరు చేస్తామని పేర్కొంది. ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: టిక్..టిక్.. టిక్.. మాంద్యంలోకి జారుకుంటున్నామా?