దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అక్టోబర్‌లో (గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే) 57 శాతం తగ్గింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం అక్టోబర్‌లో మొత్తం 52.7 లక్షల మంది విమానాల్లో ప్రయాణించినట్లు తెలిసింది. సెప్టెంబర్‌తో (39.4 లక్షలు) పోలిస్తే మాత్రం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండుగ సీజన్లో చాలా మంది తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు విమాన ప్రయాణాలను ఎంచుకోవడం ఇందుకు కారణం.
కొవిడ్ నేపథ్యంలో విమానాల సామర్థ్యంలో 60 శాతం వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని సెప్టెంబర్‌లో ప్రభుత్వం అదేశించింది. ఇప్పుడు ఆ పరిమితిని 70 శాతానికి పెంచింది.
వాణిజ్య విమానాల ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సెప్టెంబర్ (57-73 శాతం)తో పోలిస్తే అక్టోబర్‌లో 64-74 శాతానికి పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో ఇది 76-90 శాతంగా ఉండటం గమనార్హం.
సంస్థల వారీగా ప్రయాణికుల సంఖ్య..
- అక్టోబర్‌లో 29.3 లక్షల మంది ప్రయాణికులు ఇండిగోలో ప్రయాణించారు. దీనితో 55.5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
- అక్టోబర్‌లో స్పైస్ జెట్ 13.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. మొత్తం 7 లక్షల మందిని గమ్యస్థానాలుకు చేరవేసింది.
- ఎయిర్ఇండియాలో అక్టోబర్‌లో 4.9 లక్షల మంది ప్రయాణించారు. దీనితో సంస్థ మార్కెట్ వాటా 9.4 శాతంగా నమోదైంది.
- విస్తారా అక్టోబర్‌లో 3.4 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరవేసి 6.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
- ఎయిర్ ఏషియా అక్టోబర్‌లో 3.7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 7.1 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
- గోఎయిర్‌లో అక్టోబర్‌లో 4 లక్షల మంది ప్రయాణం చేశారు. దీనితో 7.5 శాతం మార్కెట్ వాటా దక్కింది.
- ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య మొత్తం 4.93 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 11.82 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి:'వివాద్ సే విశ్వాస్'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు!