వాహన బీమా పరిహారం ఎలా లెక్కిస్తారో తెలుసా? - వాహన బీమాలో భౌగోళిక పరిస్థితులు ఏమిటి
వాహన బీమా తీసుకోవడం ద్వారా.. ప్రమాదాల్లో, దొంగతనం వల్ల జరిగే నష్టానికి ధీమా లభిస్తుంది. అయితే బీమా మొత్తాన్ని చెల్లించేందుకు వాహనం కొన్న సంవత్సరం, మోడల్, ఎంత కాలం వాడారు అనే విషయాలను పరిగణిస్తాయి బీమా కంపెనీలు. ఈ బీమా పరిహారం లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
వాహనం దొంగతనానికి గురైనా, లేదా ప్రమాదం వల్ల పూర్తి నష్టం ఏర్పడినా గరిష్ఠ బీమా పరిహారం ఇచ్చేలా బీమా కంపెనీ చూసుకుంటుంది. ఇందుకోసం మోటారు పాలసీ కొనుగోలు సమయంలోనే బీమా ప్రకటిత విలువ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, ఐడీవీ) లెక్కిస్తారు.
వాహన కంపెనీ, మోడల్, రూపొందించిన సంవత్సరం, కొనుగోలు ధరను పరిగణనలోకి తీసుకుని వాహనాన్ని వినియోగించిన కాలానికి తరుగుదల విలువను తొలగించి ఎంతైతే విలువ వస్తుందో దానినే ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూగా నిర్ణయిస్తారు.
నియమనిబంధనలను అనుసరించి వాహనాన్ని మరమ్మతు చేసేందుకు అయ్యే ఖర్చు బీమా ప్రకటిత విలువ కన్నా 75శాతం దాటితే 'కన్స్ట్రక్టివ్ టోటల్ లాస్' (పూర్తి నష్టం)గా పరిగణిస్తారు
తరుగుదల విలువ లెక్కింపు..
వాహనం వాడుక కాలం ఆధారంగా తరుగుదల విలువ (డిప్రిషియేషన్ వాల్యూ)ను లెక్కించాల్సి ఉంటుంది. బీమా ప్రకటిత విలువ లెక్కింపులో ఈ తరుగుదల విలువనే ముందుగా చూస్తారు.
వాహనం వాడుకలో ఉన్న కాలం | తరుగుదల (శాతం) |
ఆరు నెలలలోపు | 5 |
6-12 నెలలు | 15 |
1-2 ఏళ్లు | 20 |
2-3 ఏళ్లు | 30 |
3-4 ఏళ్లు | 40 |
4-5 ఏళ్లు | 50 |
విడిభాగాల మరమ్మతు లేదా కొత్తవి అమర్చుకునేందుకు…
వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు పాడైన విడిభాగాలకు బదులు కొత్తవి అమర్చుకునేందుకు లేదా వాటినే మరమ్మతు చేయించుకునేందుకు ఖర్చు అవుతుంది. దీని కోసం పూర్తి బీమాను క్లెయిం చేసుకోకుండా కొంత మేరకు పరిహారం అడగవచ్చు. వాహన వాడుక కాలానికి సంబంధం లేకుండా విడిభాగాల రకాన్ని బట్టి తరుగుదల విలువ ఉంటుంది.
- రబ్బరు, నైలాన్, ప్లాస్టిక్, టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు, ఎయిర్‌బ్యాగులు- 50శాతం
- ఫైబర్ గ్లాస్ భాగాలకు- 30శాతం
- గాజుతో తయారైన విడిభాగాలకు ఏమీ లేదు
- ఇతర విడిభాగాలకు (చెక్కతో చేసినవి కూడా) వాహనం వాడుతున్న కాలాన్ని బట్టి తరుగుదల నిర్ణయిస్తారు.
వాహనం వాడుకలో ఉన్న కాలం | తరుగుదల (శాతం) |
ఆరు నెలల లోపు | 5 |
6-12 నెలలలోపు | 10 |
1 నుంచి 2 ఏళ్ల దాకా | 15 |
2 నుంచి 3 ఏళ్ల దాకా | 25 |
3 నుంచి 4 ఏళ్ల వరకు | 35 |
4 నుంచి 5 ఏళ్ల దాకా | 35 |
5 నుంచి 10 ఏళ్ల దాకా | 40 |
10 ఏళ్లు దాటినదైతే | 50 |
భౌగోళిక పరిమితులు
వాహన బీమాను కొనుగోలు చేసేటప్పుడే వాహనం రిజిస్టర్ అయిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని దాని భౌగోళిక పరిమితిని నిర్ణయిస్తారు.
ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాల విషయంలో భారత దేశం మొత్తాన్ని రెండు జోన్లుగా విభజించారు.
జోన్ ఏ: హైదరాబాద్,బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయి, న్యూ దిల్లీ, పుణె, అహ్మదాబాద్.
జోన్ బి: దేశంలోని మిగిలిన ప్రాంతాలు
సాధారణంగా జోన్ (ఏ) పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలకు ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు భౌగోళిక పరిధి దాటిన తర్వాత వాహనానికి జరిగే నష్టానికి క్లెయిం అందించవు.
మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించి మన వాహనానికి భౌగోళిక పరిమితులను పెంచుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాల్లో భౌగోళిక పరిమితులను పొందేందుకు చెల్లించాల్సిన అదనపు ప్రీమియం ప్యాకేజీ పాలసీలకైతే రూ.500, ఇతర పాలసీలకు అయితే రూ.100గా ఉంటుంది. 12 నెలల కాలపరిమితితో అన్ని రకాల వాహనాలకు ఇదే ప్రీమియం వర్తిస్తుంది.
ఈ పరిధి పెంచుకున్న ప్రాంతాల్లో వాహనానికి జరిగే నష్టానికి, అందులో ప్రయాణించే వారికి, సముద్రమార్గం లేదా వాయుమార్గంలో తరలించేటప్పుడు వాహనానికి కలిగే నష్టానికి ఎలాంటి బీమా వర్తించదు.
ఇవీ చదవండి:
TAGGED:
వాహనా బీమా పరిహారం లెక్కింపు