జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సైరస్ మిస్త్రీ స్పందించారు. టాటా సన్స్ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా పునర్నియామకం చేసినా.. తిరిగి ఆ పదవి చేపట్టేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా తనను తొలగించడంపై చేసిన పోరాటానికి... ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పు తగిన గుర్తింపు నిచ్చిందని సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు.
"ఎన్సీఎల్ఏటీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా.. తిరిగి 'టాటా సన్స్' కార్యనిర్వాహక ఛైర్మన్ పదవిని చేపట్టను. టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్షిప్లో కొనసాగను. అయితే బోర్డులో సభ్యత్వం కోసం, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తాను."- సైరస్ మిస్త్రీ
టాటా గ్రూప్ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలే తనకు ముఖ్యమని మిస్త్రీ వ్యాఖ్యానించారు.
సుప్రీంకు... టాటా
టాటా సన్స్ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమిస్తూ... జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యూనల్ గత ఏడాది డిసెంబర్ 18న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టాటాసన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు సమావేశం ఉన్నందున ట్రైబ్యునల్ తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని టాటా సన్స్.. సుప్రీం కోర్టును అభ్యర్థించింది.
కార్పొరేట్ ప్రజాస్వామ్యం బలహీనపరిచింది..
ఎస్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై టాటా సన్స్ తీవ్రంగా స్పందించింది. టాటా సన్స్ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ పునర్నియామకానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు 'కార్పొరేట్ ప్రజాస్వామ్యాన్ని' బలహీనపరిచేదిగా ఉందని టాటా సన్స్ అభిప్రాయపడింది. అలాగే బోర్డు డైరెక్టర్ల హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్‌స్టార్ రజనీ