Indian music on flights: దేశంలోని ఎయిర్లైన్లు తమ విమానాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. విమానాశ్రయాలలోనూ ఇండియన్ మ్యూజిక్‌ను ప్లే చేయాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలన్నీ.. తమ సంస్కృతిని ప్రతిబింబించే సంగీతాన్ని ప్రయాణికులకు వినిపిస్తుంటాయని.. భారతీయ ఎయిర్లైన్లు, విమానాశ్రయాలు కూడా అదే పాటించాలని అన్నారు.
Indian music in Airports:
భారత సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్) ఇచ్చిన మెమోరాండం ఆధారంగా ఈ సిఫార్సులు చేశారు సింధియా. వీటిని పాటించాలని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్, ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్‌లకు.. పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధి లేఖ రాశారు.
"భారతీయ ఎయిర్లైన్లు తమ విమానాల్లో ఇండియన్ మ్యూజిక్‌ను అరుదుగా ప్లే చేస్తాయి. భారత సంగీతానికి సుసంపన్నమైన వారసత్వం ఉంది. ప్రతి భారతీయుడు గర్వించే అనేక అంశాల్లో సంగీతం ఒకటి. విమానాశ్రయాలతో పాటు భారత్‌లో నడిచే విమానాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని ఐసీసీఆర్ సిఫార్సు చేసింది. దీన్ని విమానాయాన సంస్థలు పాటించాలని విజ్ఞప్తి."
-ఉషా పాధి, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి
ఎయిర్లైన్లు ఈ సిఫార్సులను అమలు చేస్తే.. భారతీయ సంగీతం మరింత బలోపేతం అవుతుందని సింధియా అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: నచ్చిన సంగీతం వింటే మెదడుకు ఎంతో హాయి!