ప్రస్తుతం వాహన పరిశ్రమను వేధిస్తున్న చిప్‌సెట్ల కొరత తాత్కాలికమేనని.. 2022 కల్లా ఇది పరిష్కారం కావొచ్చని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపారు. ఉత్పత్తి పాక్షికంగా తగ్గిందని, దీని ప్రభావం ఎక్కువగా ఏమీ లేదని మంగళవారం జరిగిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో వాటాదార్లకు వివరించారు. 'సంప్రదాయ కార్ల విభాగంలో మారుతీ అగ్రస్థానంలో ఉంది. భవిష్యత్‌లో విద్యుత్తు వాహనా (ఈవీ)ల్లోనూ అగ్రస్థానం సాధించాలన్నదే మా ఉద్దేశం. భారీ స్థాయిలో ఈవీలు వచ్చినపుడే వినియోగదార్లకు అందుబాటు ధరలోకి వస్తాయి. అప్పుడే మేము వాటి ఉత్పత్తి ప్రారంభిస్తాం. విద్యుత్ కార్ల విభాగంలోకి ఇప్పటికే కొన్ని కంపెనీలు అడుగుపెట్టినా.. విక్రయాలు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మారుతీ మార్కెట్ వాటాపై ప్రభావం లేదు. కంపెనీకి కూడా నష్టాలు రాకుండా కార్యకలాపాలు నిర్వహించేలా ఉన్నపుడే ఈవీల ఉత్పత్తి ప్రారంభిస్తామ'న్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.4500 కోట్ల మూలధన వ్యయాలను నిర్ణయించుకున్నాం. వాస్తవ వ్యయాలు ఏడాది చివరికానీ తెలియవ'ని చెప్పారు.
మనం పాశ్చాత్య దేశాలను అనుసరించకూడదు
'పర్యావరణ మార్పులు, సున్నా ఉద్గారాలు, కర్బన తటస్థం వంటి అంశాల విషయాల్లో పాశ్చాత్య దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని, వారు సూచించినట్లు మనం అడుగులు వేయకూడదు. మనం ప్రపంచంతో కలిసే పనిచేయాలి. ఉద్గారాలను తగ్గించాలి. అయితే మనకు, సంపన్న దేశాలకు ఆదాయాలు, జీవనశైలి, తలసరి విద్యుత్ వినియోగంలో చాలా అంతరాలున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. ఆ అంతరం పూడ్చాలంటే మన తలసరి ఇంధన వినియోగం మరింత అవసరం. అందుకే మన సొంత గడువులు పెట్టుకోవాలి. మన ప్రజలు పాటించలేని నిబంధనలను మనం పెట్టుకోకూడదు. అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోలిస్తే, కర్బన తటస్థ పరిస్థితులకు చేరుకోవడానికి ఇక్కడ ఎక్కువ సమయం పడుతుంద'ని వివరించారు.
కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవాలి
కరోనా సమయంలో కంపెనీల యాజమాన్యాలు వ్యక్తిగత వ్యయాలు తగ్గించుకోవాలని భార్గవ పిలుపునిచ్చారు. యాజమాన్యాల వ్యయాలపై ఇటీవల వాటాదార్ల నిర్ణయాలు మొత్తం పరిశ్రమకు మేలు చేస్తుందన్నారు. పరిశ్రమ, కంపెనీలు అంతర్గత వనరులను పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ సూచించారు. ఇటీవల ఐషర్ మోటార్స్ ఎండీ పారితోషికం అధికం చేయడంతో, పునర్నియామకానికి వాటాదార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భార్గవ ఇలా పేర్కొన్నారని అంచనా.
ఇవీ చదవండి: