బిట్ కాయిన్ విలువ
- 2021 ఏప్రిల్ 14.. 64000 డాలర్లు
- 2021 మే 19.. 30000 డాలర్లు
- 2021 అక్టోబరు 20.. 66000 డాలర్లు
ఈ ఏడాదిలో అదీ 6 నెలల వ్యవధిలో బిట్‌కాయిన్ (Bitcoin Etf News) విలువ తీవ్ర ఒడుదొడుకులకు లోనైందో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తమ కార్ల కొనుగోళ్ల చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తామంటూ చేసిన ప్రకటనతో, బిట్‌కాయిన్ విలువ అమాంతం దూసుకెళ్లి ఏప్రిల్ మధ్యలో 64895 డాలర్ల వద్ద అప్పటికి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ టెస్లా అధినేతే బిట్‌కాయిన్ చెల్లింపులు స్వీకరించబోమని ప్రకటించడం, చైనా బ్యాంకులు కూడా బిట్‌కాయిన్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో మేలో ఈ ఊహాజనిత కరెన్సీ విలువ ఒక్కసారిగా కుప్పకూలి 30000 డాలర్లకు పతనమైంది. మళ్లీ జూన్ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చినా.. అక్టోబరులో దూకుడు అధికమైంది. తాజాగా బిట్‌కాయిన్ ఆధారిత ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదుకావడంతో.. గత గరిష్ఠమైన 64895 డాలర్ల విలువను బిట్‌కాయిన్ అధిగమించింది. 66000 డాలర్ల మైలురాయిని అందుకోవడమే కాకుండా కొత్త జీవనకాల గరిష్ఠమైన 66,975 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వద్దు.. వద్దంటూనే..
బిట్‌కాయిన్ అంటే కంటికి కనిపించని ఊహాజనిత కరెన్సీ. ఎవరి నియంత్రణ పరిధిలోకి రాదు. అందువల్ల విలువ పరంగా ఎప్పుడు.. ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అయినా కానీ.. బిట్‌కాయిన్‌లలోకి పెట్టుబడులు వెల్లువెత్తడానికి కారణమేంటి? ఇప్పుడు.. ఈటీఎఫ్ రూపంలోనూ అందుబాటులోకి రావడంతో, ఇందులో పెట్టుబడులు పెట్టడం మరింత సులభమైనట్లే అనే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు తీసుకు రావడానికి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ (ఎస్‌ఈసీ) తొలుత అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే స్వభావం ఉండటం, క్రిప్టోకరెన్సీలకు నియంత్రణాధికార సంస్థలు లేనందునే ఆ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్యారీ జెన్‌స్లర్ ఎస్‌ఈసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లకు అనుమతులిచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఫ్యూచర్ ఆధారిత ఈటీఎఫ్‌ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నియంత్రిత మార్కెట్‌లో అవి ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చారు. అలా.. అక్టోబరు 19న న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రోషేర్స్ బిట్‌కాయిన్ స్ట్రాటజీ ఈటీఎఫ్ (సంక్షిప్తంగా బిటో)నకు అంకురార్పణ జరిగింది.
మరిన్ని వస్తాయా..
బిట్‌కాయిన్ రూపంలో ఈటీఎఫ్‌లను తీసుకొచ్చేందుకు చాలా సంస్థలు ప్రయత్నించాయి. కారణాలేమైనా కావచ్చు కానీ.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఈటీఎఫ్ విజయవంతం కావడంతో.. ఇతర సంస్థలు మళ్లీ ఆ ప్రయత్నాలను మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేవు. మున్ముందు మరిన్ని ఈ తరహా ఈటీఎఫ్‌లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులంటే ఇప్పటికీ చాలా మందిలో భయాందోళనలు ఉన్నమాట వాస్తవం. నేరగాళ్ల కార్యకలాపాలకు బిట్‌కాయిన్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వినిపిస్తుండటమే ఇందుకు కారణం. అయితే నియంత్రణ పరిధిలోనే ఈటీఎఫ్‌లు ట్రేడవుతున్నందున ఆ భయాలు కొంత మేర తగ్గొచ్చనే మాట వినిపిస్తోంది. అమెరికాలో ఇప్పటికే కొన్నాళ్లుగా కొంతమంది ట్రేడర్లు బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఈటీఎఫ్ రూపంలో అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పింఛను ఫండ్స్ లాంటి సంస్థలు కూడా వీటిల్లో ఉండొచ్చు. ఇదే జరిగితే ఫైనాన్షియల్ మార్కెట్లలో బిట్‌కాయిన్‌కు ఆదరణ పెరుగుతోందని అనుకోవచ్చు. ఈ పరిణామం ఇతర క్రిప్టోకరెన్సీల పట్ల మదుపర్ల వైఖరిలోనూ సానుకూలతను తీసుకు రావచ్చు. ఏదేమైనా.. మున్ముందు క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం సులభమవ్వడమే కాదు.. సర్వసాధారణమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మనదేశంలో కూడా క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళనలు వ్యక్తం చేస్తూ, తాము సొంతగా డిజిటల్ కరెన్సీని రూపొందిస్తామని చెబుతోంది. దేశీయంగా క్రిప్టోపై చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఆరంభమే అదుర్స్..
ఈటీఎఫ్‌లు సాధారణ షేర్లు లాంటివే. ఇవి నియంత్రణ సంస్థ పర్యవేక్షణలోనే ట్రేడవుతుంటాయి. ఏదేని బ్రోకరేజీ ఖాతా తీసుకుని వీటిని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఇలాంటి ఈటీఎఫే అమెరికా స్టాక్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. బిట్‌కాయిన్ రూపంలో ఒక ఈటీఎఫ్ వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. ఊహించినట్లే తొలి రోజే (అక్టోబరు 19న) దీనికి విశేష ఆదరణ లభించడంతో.. విలువ 5 శాతం వరకు పెరిగింది. తద్వారా అత్యధికంగా ట్రేడవుతున్న రెండో కొత్త ఈటీఎఫ్‌గా ఇది నిలిచింది. ఈ ప్రభావం బిట్‌కాయిన్ విలువపై అసాధారణ రీతిలో కన్పించింది. పాత రికార్డులను చెరిపేసి కొత్త శిఖరాలను అధిరోహించింది. బిట్‌కాయిన్‌లో మదుపర్ల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి.
ఇదీ చూడండి: 'డేటా వినియోగంలో మనమే అధికం.. నెలకు 12జీబీ వాడకం'